శాశ్వాత ప్రతిపాదికన మరమత్తులు చేస్తున్నాం
వెలగలేరు రెగ్యులేటర్ చానల్ సామార్ధ్యాన్ని పెంచుతున్నాం
ఎపి అసెంబ్లీలో వివరాలు వెల్లడించిన మంత్రి నిమ్మల రామానాయుడు
వెలగపూడి – ఆంధ్రప్రభ – బుడమేరుకు సంబంధించి శాశ్వత పరిష్కారంపై దృష్టి పెట్టినట్లు తెలిపారు మంత్రి నిమ్మల రామానాయుడు. కేబినెట్ సమావేశంలో కూడా బుడమేరుపై చర్చ జరిగిందన్నారు. విపత్తుల నిర్వహణ ప్రకారం కేంద్ర సహకారం కూడా అవసరమని తెలిపారు. బుడమేరు పరిష్కారానికి కొన్ని ప్రతిపాదనలు ఉన్నాయని తెలిపారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాలలో టిడిపి సభ్యులు సుజనా చౌదరి, వసంత కృష్ణ ప్రసాద్, యార్లగడ్డ వెంకట్రావులు మాట్లాడుతూ, బుడమేరు సమస్య పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారని . ఇదే పరిస్థితి కొనసాగితే బుడమేరుకు వరదలు మళ్ళీ రావడం, విజయవాడ మునగడం ఖాయమని అన్నారు. వాగులు, కాల్వల మరమ్మతులు వెంటనే చేయాలని వారు కోరారు. బుడమేరు ఆక్రమణలు అరికట్టి వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటి వరకు కనీసం బుడమేరుకు సంబంధించి మరమ్మతులు కూడా చేయాలేదని సభ్యులు వెల్లడించారు.
దీనికి నిమ్మల సమాధానం చెబుతూ, వెలగలేరు రెగ్యులేటర్ నుంచి ఎనికపాడు మీదుగా 10 వేల క్యూసెక్కుల తరలింపుపై దృష్టి పెట్టినట్లు చెప్పారు. ప్రస్తుతం తాత్కాలిక మరమ్మతులు చేయిస్తున్నామని పేర్కొన్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం బుడమేరు టెండర్లు రద్దు చేయకుండా ఉంటే విజయవాడకు ఈ పరిస్ధితి వచ్చేది కాదన్నారు. బుడమేరు ముంపుకు వైసీపీ పాలనే కారణమన్నారు. గత టీడీపీ హాయాంలోనే బుడమేరు డైవర్షన్ ఛానెల్ 37,500 క్యూసెక్కులకు పెంచేలా రూ.464 కోట్లతో టెండర్లు అప్పగించి 80 శాతం పనులు పూర్తి చేశామన్నారు. వైసీపీ ప్రభుత్వంలో బుడమేరు విస్తరణకు నిధులు ఉన్నా మిగిలిన 20 శాతం పనులకు సంబందించి తట్ట మట్టిగానీ, బస్తా సిమెంట్ పని గానీ చేయలేదని విమర్శించారు. గత టీడీపీ హాయాంలో ఎనికేపాడు యూటీ నుంచి కొల్లేరు వరకు వెళ్ళే ఛానల్ విస్తరణ పనులను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని తెలిపారు. బుడమేరు గట్లు మరమ్మత్తుల కోసం 39.05 కోట్ల రూపాయలకు కేబినెట్ ఆమోదం తెలిపిందని.. త్వరలోనే టెండర్లు పిలిచి పనులు పూర్తిచేస్తామని చెప్పారు. బుడమేరు డైవర్షన్ కెనాల్‌ను 37,500 క్యూసెక్కులకు పెంచేలా పెండింగ్ పనులు పూర్తి చేయడానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశామన్నారు.
వెలగలేరు రెగ్యులేటర్ నుంచి కొల్లేరు వరకు ఓల్డ్ ఛానెల్ సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నామన్నారు. బుడమేరు ఓల్డ్ ఛానెల్ కు సమాంతరంగా మరొక కొత్త ఛానెల్‌ను కూడా 10 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని తెలిపారు. బుడమేరు వరదల నియంత్రణకు డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద కేంద్రం సహాకారంతో ముందుకు వెళతామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వారం రోజుల పాటు కలెక్టరేట్‌లోనే వార్ రూం ఏర్పాటు చేసి ప్రజలకు అందాల్సిన సహాయక చర్యలు, పునరావాస చర్యలను స్వయంగా పర్యవేక్షించారని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు.