ISRO Scientists Resignation | ఇస్రోలో వరుస రాజీనామాలు.. కేంద్రం ఎందుకు రంగంలోకి దిగింది?

ISRO Scientists Resignation |ఇస్రోలో వరుస రాజీనామాలు.. కేంద్రం ఎందుకు రంగంలోకి దిగింది?

గగన్‌యాన్ మిషన్ పై ప్ర‌భావం ప‌డ‌కుండా కేంద్రం చ‌ర్య‌లు
కొత్త నిబంధ‌న‌లు ప్ర‌క‌టించిన అంత‌రిక్ష శాఖ‌

ISRO Scientists Resignation | ఆంధ్రప్రభ వెబ్‌, జాతీయ ప్రతినిధి: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ప్రపంచవ్యాప్తంగా తన విజయాలతో గుర్తింపు పొందిన సంస్థ. చంద్రయాన్-3, ఆదిత్య-L1, స్పాడెక్స్ వంటి విజయాలతో భారత అంతరిక్ష రంగానికి కొత్త శకాన్ని తెచ్చిన ఇస్రో ఇప్పుడు మరో కీలక సవాల్‌ను ఎదుర్కొంటోంది. గత కొద్ది నెలలుగా శాస్త్రవేత్తలు, సీనియర్ ఇంజినీర్లు వరుసగా రాజీనామాలు చేయడంతో కేంద్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. ముఖ్యంగా దేశ ప్రతిష్టాత్మక గగన్‌యాన్ (Gaganyaan Mission) ప్రాజెక్ట్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు కేంద్ర అంతరిక్ష శాఖ రాజీనామాల నిబంధనలను మరింత కఠినతరం చేసింది.

100 మందికి పైగా శాస్త్రవేత్తల రాజీనామా.. అసలు పరిస్థితి ఏంటి?

ఇటీవలి కాలంలో ఇస్రో నుంచి 100 మందికి పైగా శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు రాజీనామా చేసినట్లు విశ్వాస‌నీయ సమాచారం. ఇందులో బెంగళూరులోని యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ , తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ నుంచి ఉద్యోగాలు వీడినట్లు తెలుస్తోంది. ఇది సాధారణ ఉద్యోగ మార్పుగా కనిపించినా, రాజీనామా చేసిన వారిలో కీలక ప్రాజెక్టులకు నాయకత్వం వహించిన అధికారులు ఉండటం వల్ల అంతరిక్ష రంగంలో చర్చకు దారితీసింది.

కేంద్రం ఎందుకు రంగంలోకి దిగింది?
ఇస్రోలో శాస్త్రవేత్తల కొరత ఏర్పడితే, ప్రస్తుతం జరుగుతున్న గగన్‌యాన్, భవిష్యత్ చంద్రయాన్, అంతరిక్ష కేంద్రం వంటి వ్యూహాత్మక ప్రాజెక్టులపై ప్రభావం పడే అవకాశం ఉందనే ఆందోళన కేంద్రంలో వ్యక్తమైంది. దీంతో కేంద్ర అంతరిక్ష శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అత్యంత కీలక మిషన్లలో పనిచేస్తున్న గ్రేడ్-1 శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణుల రాజీనామాలు వెంటనే ఆమోదించకుండా కొత్త విధానం అమల్లోకి తెచ్చింది. శాస్త్రవేత్తల కొరతను అధిగమించేందుకు ఇస్రో ఇప్పటికే భారీ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ప్రారంభించింది.
దాదాపు 1,050కు పైగా శాస్త్రవేత్తలు, సాంకేతిక, పరిపాలనా పోస్టులను భర్తీ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.

కొత్త నిబంధనలు ఏమిటి?
విశ్వాస‌నీయ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు గ్రేడ్-1 శాస్త్రవేత్తల రాజీనామాలను సెంటర్ డైరెక్టర్లు స్వయంగా ఆమోదించలేరు. ప్రతి రాజీనామా దరఖాస్తును తమ సిఫార్సులతో కేంద్ర అంతరిక్ష శాఖ (న్యూఢిల్లీ) కి పంపాలి.
సంబంధిత అధికారి తన బాధ్యతలను పూర్తిగా బదిలీ చేసిన తర్వాత మాత్రమే రిలీవ్ చేయాలి.
దేశ భద్రత, వ్యూహాత్మక మిషన్ల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రతి కేసును విడిగా పరిశీలిస్తారు.
ఇది 2020లో అమల్లో ఉన్న విధానంతో పోలిస్తే మరింత కఠినమైన వ్యవస్థగా అధికారులు చెబుతున్నారు.