సంక్షేమానికి కొత్త అర్థం చెప్పిన మహానీయుడు ఎన్టీఆర్

సంక్షేమానికి కొత్త అర్థం చెప్పిన మహానీయుడు ఎన్టీఆర్
విజయవాడ, ఆంధ్రప్రభ : సంక్షేమ పథకాలకు అర్థం చెప్పిన మహానీయుడు నందమూరి తారక రామారావు అని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్, ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గద్దె అనురాధ పేర్కొన్నారు.
తూర్పు నియోజకవర్గ పరిధిలోని ఎన్టీఆర్ సర్కిల్‌లో గురువారం ఉదయం ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామమోహన్, గద్దె అనురాధ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమానికి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ, మహానాడు కార్యక్రమాలు టీడీపీ ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్నాయని తెలిపారు. హైబ్రిడ్ విధానంలో నిర్వహిస్తున్న మహానాడుకు భారీ స్థాయిలో హాజరు ఉండటం గిన్నిస్ రికార్డుకు అర్హమని అభిప్రాయపడ్డారు. ఎన్టీఆర్ సినిమా, రాజకీయ రంగాల్లో చరిత్ర సృష్టించారని పేర్కొన్నారు.
పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చి అనేక సంస్కరణలు తీసుకువచ్చారని, సంక్షేమ పథకాలకు పునాది వేశారని చెప్పారు. తెలుగువాడి గుండె చప్పుడును ఢిల్లీ వరకు వినిపించిన నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు.
ఎమ్మెల్యే గద్దె రామమోహన్ మాట్లాడుతూ, సంక్షేమానికి కొత్త అర్థం చెప్పిన మహానీయుడు ఎన్టీఆర్ అని తెలిపారు. రెండు రూపాయలకే కిలో బియ్యం పథకం, పింఛన్ విధానం ఆయన పాలనలోనే ప్రారంభమయ్యాయని గుర్తు చేశారు. కూడు, గూడు, గుడ్డ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లిన నాయకుడు ఎన్టీఆర్ అని చెప్పారు.
తెలుగుదేశం పార్టీ ఓటములను ఎదుర్కొన్నా తిరిగి విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.
గద్దె అనురాధ మాట్లాడుతూ, ఎన్టీఆర్ సినిమా, రాజకీయ రంగాల్లో ప్రభంజనం సృష్టించారని తెలిపారు. మహిళలకు ఆస్తి హక్కు, డ్వాక్రా వ్యవస్థ, మహిళా యూనివర్సిటీ వంటి కార్యక్రమాలు ఆయన పాలనలోనే ప్రారంభమయ్యాయని చెప్పారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కోసం ప్రస్తుత మహానాడులో తీర్మానం చేశారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బొప్పన భవకుమార్, చెన్నుపాటి గాంధీ, కర్ణా రమేష్, ముమ్మనేని ప్రసాద్, గొట్టిముక్కల రఘు, సి. హెచ్. ఉషారాణి, చలసాని రమణ, నర్రా కిషోర్, పామర్తి కిషోర్, యర్నేని వేదవ్యాస్, నాదెళ్ల రాజేష్, గరికపాటి బద్రి, నూతి శ్రీను, రాధారపు యల్లబాబు, శివలక్ష్మి, మార్తా సూర్యకుమారి తదితరులు పాల్గొన్నారు.
