వికారాబాద్‌పై మరో భూసేకరణ భారం.. బుల్లెట్ రైలు నుంచి రిజర్వాయర్ల వరకు భూముల వేట
- బుల్లెట్ రైలు కోసం భారీ స్థాయిలో భూసేకరణకు సన్నాహాలు
- వికారాబాద్-క్రిష్ణా రైల్వే ప్రాజెక్టుకు త్వరలో నోటిఫికేషన్
- ట్రిపుల్ ఆర్, పారిశ్రామిక కారిడార్లతో రైతుల్లో ఆందోళన
- కొడంగల్, పరిగి ప్రాంతాల్లో అత్యధికంగా భూముల సేకరణ
- కొత్త ప్రాజెక్టులన్నీ జిల్లాపైనే భారం అనే విమర్శలు
వికారాబాద్ జిల్లా, ఆంధ్రప్రభ ప్రతినిధి: మరో భూసేకరణకు సర్కార్ సిద్ధపడుతోంది. బుల్లెట్ రైలుకు భారీగా భూమి సేకరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏ కొత్త ప్రాజెక్టు చేపట్టినా జిల్లా వాసులలో ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు అతిసమీపంలో ఉండడంతో అన్ని ప్రాజెక్టులు జిల్లాలో చేపట్టడం లేదంటే జిల్లా మీదుగా వెళుతున్నాయి. రెండేళ్లుగా అనేక ప్రాజెక్టులకు జిల్లాలో భూసేకరణ చేపట్టారు. నేటికీ అనేక ప్రాజెక్టులకు భూసేకరణ కొనసాగుతోంది.
భూసేకరణ వ్యవహారాలను ప్రతిరోజు సమీక్షించేందుకు జిల్లా కలెక్టరేట్‌లో ఏకంగా ఒక ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ జిల్లా కలెక్టర్ ప్రాజెక్టులవారీగా భూసేకరణ పురోగతిని సమీక్షిస్తున్నారు. తాజాగా జిల్లా వాసులపై మరో భూసేకరణ పిడుగు పడింది. హైదరాబాద్-ముంబై కారిడార్‌లో చేపట్టిన బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు జిల్లాలో పెద్ద ఎత్తున భూసేకరణ చేయాలని నిర్ణయించారు. ఈ రైలు మార్గం జిల్లాలోని వికారాబాద్ మీదుగా వెళుతోంది. బుల్లెట్ రైలు కోసం కొత్తగా ట్రాక్ నిర్మాణం చేపడతారు.
వికారాబాద్ లేదంటే అనంతగిరిలో రైల్వే స్టేషన్ నిర్మాణం జరుగుతుంది. రాష్ట్రంలో 93 కిలోమీటర్ల మేరకు బుల్లెట్ రైలు ట్రాక్ నిర్మాణం జరుగుతుంది. ఇందులో అత్యధికంగా వికారాబాద్ జిల్లాలోనే నిర్మిస్తున్నారు. ట్రాక్ నిర్మాణానికి ఎంత మేరకు భూసేకరణ చేపడతారు అనేది వెల్లడి కావాల్సి ఉంది. త్వరలో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం కనిపిస్తోంది.
మరోవైపు వికారాబాద్ నుంచి పరిగి, కొడంగల్ మీదుగా క్రిష్ణా వరకు కొత్తగా చేపడుతున్న రైల్వే ప్రాజెక్టుకు కూడా భూసేకరణ చేయాల్సి ఉంది. ఈ ప్రాజెక్టుకు త్వరలో తుది అనుమతి వచ్చే అవకాశం ఉంది. ఆ వెంటనే భూసేకరణ చేపట్టేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ ప్రాజెక్టు నిమిత్తం వికారాబాద్, పరిగి, కొడంగల్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భూసేకరణ చేయాల్సి ఉంది.
ఇటీవల సర్వే ప్రారంభించిన లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణంకు కూడా భూసేకరణ చేస్తామని జిల్లా అధికారులు ప్రకటించారు. జిల్లాలోని కొడంగల్‌లో పారిశ్రామిక కారిడార్, ఎడ్యుకేషన్ హబ్, ప్రభుత్వ వెటర్నరీ కాలేజీకి భూసేకరణ పూర్తి చేశారు.
రెండు జాతీయ రహదారులు ఎన్‌హెచ్-163, ఎన్‌హెచ్-167(ఎన్)లకు పెద్ద ఎత్తున భూసేకరణ చేపట్టారు. జిల్లా మీదుగా నిర్మించతలపెట్టిన రీజనల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్)కు పరిగి, వికారాబాద్ ప్రాంతాలలో భూసేకరణ చేస్తున్నారు. ఓఆర్ఆర్ నుంచి ట్రిపుల్ ఆర్‌ను అనుసంధానం చేసేందుకు రెండు రేడియల్ రోడ్లు నిర్మించాలని నిర్ణయించారు. ఈ రెండు రేడియల్ రోడ్లకు కూడా భూసేకరణ ప్రారంభించారు.
పరిగిలో రెండు చోట్ల పారిశ్రామిక పార్కులకు భూసేకరణ చేపట్టారు. దీనిని వ్యతిరేకిస్తూ రైతులు, ఆయా గ్రామాల ప్రజలు భారీ ఎత్తున నిరసన చేపట్టారు. ఇటీవల జిల్లా మీదుగా కర్ణాటకలోని బీదర్ నుంచి ఆంధ్రలోని కర్నూల్ మధ్య సౌర విద్యుత్ పంపిణీకి భారీ టవర్ల నిర్మాణం చేపట్టారు. జిల్లాలో వందల సంఖ్యలో టవర్లు నిర్మిస్తున్నారు. ఒక్కో టవర్ నిర్మాణానికి గరిష్టంగా 150 చదరపు గజాల స్థలాన్ని సేకరిస్తున్నారు.
జిల్లాలోని కొడంగల్‌లో నారాయణపేట్–కొడంగల్ ఎత్తిపోతల పథకంకు భూసేకరణ నిమిత్తం ప్రజాభిప్రాయ సేకరణ సభలు ఇటీవల నిర్వహించారు.
