గంజాయికి గుడ్‌బై.. గిరిజన ప్రాంతాల్లో రంబుటాన్ సాగుకు గ్రీన్ సిగ్నల్
గంజాయికి గుడ్‌బై.. గిరిజన ప్రాంతాల్లో రంబుటాన్ సాగుకు గ్రీన్ సిగ్నల్
- గిరిజన రైతులకు ప్రభుత్వం కొత్త జీవనోపాధి
- రంబుటాన్, అవకాడో, లీచీతో అధిక ఆదాయానికి బాట
- గంజాయి సాగు మానేసిన రైతులకే తొలి ప్రాధాన్యం
- సబ్సిడీలు, సాంకేతిక సహాయంతో ఉద్యాన విప్లవం
- అల్లూరి జిల్లాలో తొలిసారిగా రంబుటాన్ సాగు
అమరావతి, ఆంధ్రప్రభ : ఒకప్పుడు ఆక్రమ గంజాయి సాగుకు కేంద్రంగా పేరొందిన మన్యం గిరిజన ప్రాంతాలు ఇప్పుడు అధిక ఆదాయం అందించే ఉద్యాన పంటల సాగుకు చిరునామాగా మారుతోంది. గిరిజన రైతులను చట్టవిరుద్ధమైన గంజాయి సాగు నుంచి పూర్తిగా దూరం చేసి, శాశ్వత జీవనోపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా రంబుటాన్ సాగును ప్రవేశపెట్టింది. రంబుటాన్తో పాటు అవకాడో, లీచీ, డ్రాగన్ ఫ్రూట్ వంటి
అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సబ్సిడీలు, సాంకేతిక సహాయంతో ప్రోత్సహిస్తూ గిరిజన ప్రాంతాల్లో వ్యవసాయ రంగానికి కొత్త దిశను చూపుతోంది.
గిరిజనులకు కొత్త ఆశలు
గిరిజన ప్రాంతాల్లో అక్రమ గంజాయి సాగు నిర్మూలనకు పోలీసులు చేపట్టిన చర్యలతో పాటు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను కల్పించాల్సిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో అధిక విలువ కలిగిన పంటల సాగుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. రైతులకు
లక్ష్యం – గంజాయి సాగు మానేసిన వారికే తొలి ప్రాధాన్యం
నాణ్యమైన మొక్కలు, శిక్షణ, సాంకేతిక సలహాలు, ఆర్థిక ప్రోత్సాహకాలు అందిస్తూ దీర్ఘకాలిక ఆదాయం కల్పించే పథకాన్ని అమలు చేస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా అల్లూరి జిల్లాలోని ఏడు మండలాలకు చెందిన 901 మంది రైతులను ఎంపిక చేశారు. మొత్తం వెయ్యి ఎకరాలకు పైగా ఉద్యాన పంటల సాగు చేపట్టనున్నారు. ఇందులో 95 మంది రైతులు దాదాపు 100 ఎకరాల్లో రంబుటాన్, 722 మంది రైతులు సుమారు 700 ఎకరాల్లో అవకాడో, 88 మంది రైతులు సుమారు 50 ఎకరాల్లో లీచీ సాగు చేయనున్నారు. డ్రాగన్ ఫ్రూట్ వంటి ఇతర పంటలను కూడా దశలవారీగా విస్తరించనున్నారు.
తొలిసారిగా రంబుటాన్
అల్లూరి జిల్లాలో రంబుటాన్ సాగు తొలిసారి. వ్యవసాయ శాస్త్రవేత్తల సిఫార్సుల మేరకు కొండ ప్రాంతాల వాతావరణం, నేలలు ఈ పంటకు అనుకూలమని గుర్తించారు. మొక్కలు నాటిన నాలుగేళ్ల తర్వాత దిగుబడి ప్రారంభమవుతుందని అధికారులు చెబుతున్నారు. ఒకసారి తోటలు అభివృద్ధి చెందిన తర్వాత అనేక సంవత్సరాల పాటు రైతులకు స్థిరమైన ఆదాయం లభించే అవకాశం ఉంది. పథకం కింద రైతులకు నాణ్యమైన మొక్కలను ఉచితంగా అందిస్తోంది. మొక్కలు నాటిన తర్వాత తోటలు అభివృద్ధి చెందే వరకు అవసరమైన సాంకేతిక మార్గదర్శకత్వం, పర్యవేక్షణ కల్పించనుంది. నిర్వహణ ఖర్చుల కోసం రెండో ఏడాది ప్రతి రైతుకు రూ.20 వేల ఆర్థిక సాయం అందించనుంది. దీంతో ప్రారంభ దశలో రైతులపై ఆర్థిక భారం తగ్గనుంది.
సుస్థిర అభివృద్ధి వైపు అడుగులు
అధిక ఆదాయం అందించే ఉద్యాన పంటల సాగు విస్తరణతో గిరిజన ప్రాంతాల్లో ఆర్థికాభివృద్ధికి కొత్త అవకాశాలు ఏర్పడనున్నాయి. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండేలా రైతులకు స్థిరమైన ఆదాయం లభించడం ద్వారా సామాజిక, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయని అధికారులు భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని గిరిజన ప్రాంతాలకు ఈ కార్యక్రమాన్ని విస్తరించే అవకాశాలపై ప్రభుత్వం దృష్టిసారించింది.
గంజాయి నుంచి చట్టబద్ధ సాగుకు
ఒకప్పుడు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో 11 వేల ఎకరాలకు పైగా గంజాయి సాగు జరిగేది. ముఖ్యంగా జీరే వీధి, చింతపల్లి, జి.మాడుగుల, పాడేరు, ముంచింగిపుట్టు, పెదబయలు, హుకుంపేట, అనంతగిరి మండలాల్లో ఈ సాగు ఎక్కువగా ఉండేది. గత కొన్నేళ్లుగా పోలీసులు చేపట్టిన నిరంతర దాడులు, కేసులు, అవగాహన కార్యక్రమాలు, ప్రత్యామ్నాయ ఉపాధి పథకాల వల్ల గంజాయి సాగు దాదాపు పూర్తిగా అంతరించిపోయిందని అధికారులు వెల్లడిస్తున్నారు.
ఈ పథకంలో గతంలో గంజాయి సాగు చేసినప్పటికీ ప్రస్తుతం చట్టబద్ధ వ్యవసాయం వైపు మళ్లిన రైతులకే తొలి ప్రాధాన్యం ఇచ్చారు. పోలీసుల నుంచి సేకరించిన సమాచారంతో ఉద్యాన శాఖ అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసింది. కొన్నేళ్ల క్రితం ఈ ప్రాంతాల్లో దాదాపు 30 శాతం మంది రైతులు గంజాయి సాగులో ఉండగా, ప్రస్తుతం వారంతా ఉద్యాన, వాణిజ్య పంటల వైపు అడుగులు వేస్తున్నారు.
రంబుటాన్, అవకాడో, లీచీతో పాటు రాజ్మా వంటి వాణిజ్య పంటలను కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. రాజ్మా విత్తనాలను 90 శాతం సబ్సిడీతో, ఎరువులను 50 శాతం సబ్సిడీతో రైతులకు అందిస్తున్నారు. ఈ పంటలు గిరిజన రైతులకు స్థిరమైన ఆదాయం తీసుకురావడంతో పాటు వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మారుస్తాయని ఆయన పేర్కొన్నారు.
