ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ
కుటుంబ నియంత్రణతో ఆరోగ్యకర సమాజం సాధ్యమని వైద్యాధికారుల పిలుపు
పాలకుర్తి, ఆంధ్రప్రభ: ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం బసంత్‌నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో శనివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వై. పవిత్ర మాట్లాడుతూ జనాభా పెరుగుదలతో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులపై ఒత్తిడి పెరుగుతుందని తెలిపారు. ప్రజలు స్వచ్ఛందంగా కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటిస్తూ, గర్భధారణల మధ్య తగిన వ్యవధిని పాటించాలని సూచించారు.
జూలై 11 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించే కుటుంబ నియంత్రణ ఆరోగ్య కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ఆసుపత్రి పెద్దపల్లి, జీజీహెచ్ రామగుండంలో కాపర్-టి, అంతరా ఇంజెక్షన్, నిరోధ్, డీపీఎల్, ట్యూబెక్టమీ, వాసెక్టమీ వంటి తాత్కాలిక, శాశ్వత కుటుంబ నియంత్రణ సేవలు అందుబాటులో ఉన్నాయని వివరించారు.
ఈ కార్యక్రమంలో మాతా-శిశు సంరక్షణ ప్రోగ్రాం అధికారి డాక్టర్ లక్ష్మీభవాని, బసంత్‌నగర్ వైద్యాధికారి డాక్టర్ శరళి, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు.
