ప్రభుత్వ పాఠశాలల్లో అత్యాధునిక డిజిటల్ బోధన
ప్రభుత్వ పాఠశాలల్లో అత్యాధునిక డిజిటల్ బోధన
- డీఈఓ అశోక్
కమ్మర్‌పల్లి, ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక డిజిటల్ విద్యా బోధన అమలవుతోందని నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ తెలిపారు.
కమ్మర్‌పల్లి మండలం ఉప్లూర్, కోనాపూర్, ఎర్గట్ల మండలం తాళ్లరాంపూర్ ఉన్నత పాఠశాలల పాంప్లెట్ల ఆవిష్కరణ సందర్భంగా మంగళవారం ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఖాన్ అకాడమీ పాఠ్యాంశాలు, ఇంటిగ్రేటెడ్ ఫ్లాట్ ప్యానెల్‌ల ద్వారా బోధన జరుగుతోందని, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో విద్యా బోధనకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు.
వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ అందించనున్నట్లు చెప్పారు. యూనిఫామ్, నోట్‌బుక్స్‌తో పాటు స్కూల్ కిట్లు కూడా పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న సౌకర్యాలను ఉపాధ్యాయులు “బడిబాట” కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
10వ తరగతి పరీక్షల్లో ఉప్లూర్ పాఠశాల విద్యార్థులు 568 మార్కులతో ఉత్తమ ఫలితాలు సాధించినందుకు గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు కత్రోజి రాజన్నను డీఈఓ అభినందించారు.
ఈ కార్యక్రమంలో కోనాపూర్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చౌడారపు రాంప్రసాద్, తాళ్లరాంపూర్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నాంపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
