ధాన్యం కొనుగోలు ఖర్చులన్నీ కేంద్రానివే.. రాష్ట్రం మధ్యవర్తి మాత్రమే

ధాన్యం కొనుగోలు ఖర్చులన్నీ కేంద్రానివే.. రాష్ట్రం మధ్యవర్తి మాత్రమే

-కేంద్ర మంత్రి బండి సంజయ్

కరీంనగర్, ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్: రైతులు కష్టించి పండించిన ప్రతి ధాన్యపు గింజను కేంద్ర ప్రభుత్వ నిధులతోనే కొనుగోలు చేస్తున్నామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు.

మంగళవారం రాత్రి కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పురపాలక సంఘ భవనంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో సుతిలీతాడు నుంచి రవాణా ఖర్చుల వరకు అన్నీ కేంద్ర ప్రభుత్వమే భరిస్తోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం మధ్యవర్తి పాత్రలో మాత్రమే ఉందని ఆయన పేర్కొన్నారు.

మధ్యవర్తిత్వం చేసినందుకు కేంద్రం రాష్ట్రానికి కమీషన్ కూడా ఇస్తోందని, అయినప్పటికీ ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతోందని విమర్శించారు.

ఇకనైనా బేషజాలకు పోకుండా యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రతి గింజను కొనుగోలు చేయాలని, అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని సూచించారు.

పొరపాట్లు జరిగిన చోట గుర్తించి వెంటనే సరిచేసుకుని వడ్ల కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన అన్నారు. రైతుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు బీజేపీ “రైతు గోస – బీజేపీ భరోసా” పేరుతో యాత్రలు నిర్వహిస్తోందని తెలిపారు.

Leave a Reply