యూరియా యాప్‌పై కేటీఆర్ సెటైర్లు

యూరియా యాప్‌పై కేటీఆర్ సెటైర్లు

షాప్‌లో ఉంటే కదా.. యాప్‌లో దొరికేది: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

సిరిసిల్ల, ఆంధ్రప్రభ: రాష్ట్రంలోని రైతులకు యూరియా బస్తాలు కావాలంటే షాప్‌లో ఉంటేనే యాప్‌లో దొరుకుతాయని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం షాప్‌లోనే లేని యూరియాను యాప్‌లో బుక్ చేసుకోవాలంటూ రైతులకు కొత్త ఇబ్బందులు సృష్టిస్తోందని ఆరోపించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సిరిసిల్ల తెలంగాణ భవన్‌లో జెండా ఆవిష్కరించి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఆవిర్భవించి 12 ఏళ్లు పూర్తవుతున్నాయని అన్నారు.

గత పదేళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలోనే రాష్ట్రాన్ని 50 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లిందని విమర్శించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు నిరంతర విద్యుత్ అందించారని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ కరెంటు కోతలు మొదలయ్యాయని అన్నారు.

యూరియా కొనాలంటే రైతులు షాపుల వద్ద క్యూలు కట్టాల్సిన పరిస్థితి ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. యాప్‌లో బుక్ చేసుకుంటేనే యూరియా దొరుకుతుందని చెప్పడం దారుణమని అన్నారు. “అసలు షాప్‌లో ఉంటే కదా.. యాప్‌లో దొరికేది” అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ అప్పులు చేసినా పది జిల్లాలుగా ఉన్న తెలంగాణను 34 జిల్లాలుగా మార్చారని, తండాలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేసి అభివృద్ధి, సంక్షేమం దిశగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లారని కేటీఆర్ తెలిపారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో కనీసం జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదని ఆరోపించారు.

రైతుల అభివృద్ధి కోసం కేసీఆర్ ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా రైతుబంధు ఇచ్చారని, రైతులకు రైతుబంధు ఇవ్వని ముఖ్యమంత్రిని ఎక్కడా చూడలేదని కేటీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రజలంతా జేఏసీగా ఏర్పడి తెలంగాణ కోసం పోరాడినప్పుడు కాంగ్రెస్, బీజేపీలు తలవంచక తప్పలేదని పేర్కొన్నారు. అమరుల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చాలనే లక్ష్యంతో బీఆర్‌ఎస్ ప్రభుత్వం పనిచేసిందన్నారు. కానీ ప్రస్తుతం ఉన్న తెలంగాణను ఢిల్లీకి తాకట్టు పెడుతున్నారని కేటీఆర్ విమర్శించారు.

ఏడాదికి లక్ష ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం కనీసం 4 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేని స్థితిలో ఉందని ఆరోపించారు. ఉద్యోగాలు లేక రాష్ట్రంలోని యువత ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అడిగిన వారిపై కేసులు పెడుతూ భయభ్రాంతులకు గురి చేస్తోందని విమర్శించారు. రెండున్నరేళ్లలో రూ.4.30 లక్షల కోట్ల అప్పు చేసి ప్రాజెక్టులు కట్టారా, ప్రజలకు స్కూటీలు ఇచ్చారా అని కేటీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ శ్రేణులు కలిసికట్టుగా పనిచేసి అధికారంలోకి రావాలని, కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకోవాలని పిలుపునిచ్చారు.

Leave a Reply