రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఆగమాగం

రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఆగమాగం

-మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి

భూపాలపల్లి, ఆంధ్రప్రభ:

రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉన్నప్పటికీ, వారి సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి విమర్శించారు. గురువారం భూపాలపల్లిలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఎగుమతి, దిగుమతి ప్రక్రియలో జాప్యం జరగడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అయినా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజల సమస్యలపై దృష్టి సారించకుండా గాలిలో తిరుగుతున్నారని ఆయన ఆరోపించారు. కనీసం ముఖ్యమంత్రి నియోజకవర్గంలో కూడా రైతులు నిరసన తెలిపే దుస్థితి ఏర్పడిందని, దీనిని ప్రజలు గమనించాలని సూచించారు. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం మరో రెండు, మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని, అటువంటి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఒకవేళ వర్షాలకు ధాన్యం తడిస్తే, తడిసిన ప్రతి గింజను ప్రభుత్వమే మద్దతు ధరతో కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

బీజేపీ యాత్రపై వ్యంగ్యం
“రైతు గోస – బీజేపీ భరోసా” యాత్ర రైతుల సమస్యలను చూడటానికి కాకుండా, పార్టీ ప్రచారానికి వచ్చినట్లుగా హంగు ఆర్భాటాలతో సాగుతోందని ఎద్దేవా చేశారు. ఇకనైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన కోరారు.

రైతులకు విజ్ఞప్తి, అధికారులకు హెచ్చరిక
పంట పొలాలను దగ్ధం చేయడం వల్ల పర్యావరణానికి హాని కలుగుతుందని, రైతులు అటువంటి చర్యలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. ఎండ తీవ్రత దృష్ట్యా ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అభివృద్ధి పనుల శిలాఫలకాలను ధ్వంసం చేసే సంప్రదాయం మంచిది కాదని, రాజకీయాల్లో హుందాతనం పాటించాలని హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా, మండల స్థాయి నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply