కొనుగోలు చేసిన పంట ధాన్యాన్ని తరలించాలి…

కడెం, ఆంధ్రప్రభ : కొనుగోలు కేంద్రాల్లో పంట ధాన్యం, మొక్కజొన్నను సక్రమంగా కొనుగోలు చేయడం లేదని, కొనుగోలు చేసిన ధాన్య బస్తాలను తరలించేందుకు లారీలు అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆరోపిస్తూ రైతులు సోమవారం ఆందోళన చేపట్టారు. కడెం మండలంలోని నచ్చన్ ఎల్లాపూర్ గ్రామం వద్ద నిర్మల్–మంచిర్యాల ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
లింగాపూర్, మాసాయిపేట్, ఎలగడప, నచ్చన్ ఎల్లాపూర్, సారంగాపూర్ గ్రామాలకు చెందిన రైతులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రాల్లో నెలరోజుల క్రితమే కొనుగోలు చేసిన వరి ధాన్యం, మొక్కజొన్నను ఇప్పటికీ తరలించకపోవడంతో అకాల వర్షాలు, రానున్న వర్షాకాలం కారణంగా పంట నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని రైతులు ఆరోపించారు. లారీలు త్వరలో వస్తాయని చెబుతున్నప్పటికీ సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదన్నారు. ప్రజాప్రతినిధులు కూడా ఈ అంశాన్ని పట్టించుకోవడం లేదని విమర్శించారు.
రైతుల ఆందోళనతో నిర్మల్–మంచిర్యాల ప్రధాన రహదారిపై మూడు గంటల పాటు రాకపోకలు స్తంభించాయి. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలు, ఆటోలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి.
ఆందోళనలో రైతు అస్వస్థత
ధర్నాలో పాల్గొన్న లింగాపూర్ గ్రామానికి చెందిన ఆకుల నరసయ్య అనే రైతు ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే అక్కడున్న వారు కారులో కడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
రైతులతో చర్చించిన అధికారులు
ధర్నా జరుగుతున్న ప్రాంతానికి కడెం ఎంఆర్‌ఐ శారద, ఖానాపూర్ సీఐ సీహెచ్ అజయ్, కడెం పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ ఈ. సాయికిరణ్, జీపీ గంగాధర్ చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా కొందరు రైతులు తమ సమస్యను పరిష్కరించాలని అధికారులను వేడుకున్నారు.
రైతులతో మాట్లాడిన ఎంఆర్‌ఐ శారద, జిల్లా అధికారులతో ఇప్పటికే చర్చించినట్లు తెలిపారు. ధాన్యం రవాణా కోసం లారీలను ఏర్పాటు చేసి రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో రైతులు తమ ఆందోళనను విరమించారు.
