ఐఎస్‌బీ శిక్షణకు ఐఅండ్‌పీఆర్ డైరెక్టర్ విశ్వనాథన్
ఆగస్టు 12 నుంచి 24 వరకు మొహాలీలో జరిగే పబ్లిక్ పాలసీ శిక్షణలో పాల్గొననున్న ఐఅండ్‌పీఆర్ డైరెక్టర్..
తాత్కాలికంగా సూర్యతేజకు అదనపు బాధ్యతలు
అమరావతి, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ సమాచార, పౌరసంబంధాల శాఖ (ఐఅండ్‌పీఆర్) డైరెక్టర్ కె.ఎస్. విశ్వనాథన్‌కు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) నిర్వహించే 11వ అడ్వాన్స్‌డ్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్ ఇన్ పబ్లిక్ పాలసీ (AMPPP)లో పాల్గొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఆగస్టు 12 నుంచి 24 వరకు పంజాబ్‌లోని ఐఎస్‌బీ మొహాలీ క్యాంపస్‌లో నిర్వహించే రెసిడెన్సీ–1 శిక్షణ కార్యక్రమంలో విశ్వనాథన్ పాల్గొంటారు. ఈ కాలాన్ని పూర్తిగా “ఆన్ డ్యూటీ”గా పరిగణించాలని, ప్రధాన కార్యాలయాన్ని విడిచి వెళ్లేందుకు కూడా అనుమతి మంజూరు చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
విశ్వనాథన్ శిక్షణలో పాల్గొనే 13 రోజుల పాటు ఆయన నిర్వహిస్తున్న అన్ని బాధ్యతలను 2020 బ్యాచ్ ఐఏఎస్ అధికారి మల్లవరపు సూర్యతేజకు పూర్తి అదనపు బాధ్యతలుగా (FAC) అప్పగించారు. దీంతో ఆ కాలంలో ఐఅండ్‌పీఆర్ శాఖ పరిపాలనా బాధ్యతలను సూర్యతేజ నిర్వహించనున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక పబ్లిక్ పాలసీ శిక్షణా కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ నుంచి ఏపీ ఎయిర్‌పోర్ట్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ ప్రవీణ్ ఆదిత్య, ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియా, కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె. బాలాజీ కూడా హాజరుకానున్నారు. ప్రజా విధానాల రూపకల్పన, పరిపాలనా సామర్థ్యాల పెంపు, ఆధునిక పాలనా విధానాలపై అవగాహన కల్పించే లక్ష్యంతో నిర్వహించే ఈ శిక్షణా కార్యక్రమం దేశవ్యాప్తంగా ఐఏఎస్ అధికారులకు ప్రతిష్ఠాత్మకంగా గుర్తింపు పొందింది.
