Illegal-Constructions : ఆపరేషన్ కలెక్షన్ Andhra Prabha Exclusive Story
Illegal-Constructions : ఆపరేషన్ కలెక్షన్ Andhra Prabha Exclusive Story
- ప్లాన్ తో పని లేదు..
- అనుమతి అక్కర్లేదు
- క్యాష్ కొడితే సరి
- ఆక్రమించుకో
- కాంప్లెక్స్ కట్టుకో
- ఇదీ వసూళ్లకు భీమవరం

( నిఘా విభాగం, ఆంధ్రప్రభ )
కంచె చేను మేస్తున్నట్లుగా భీమవరంలో టౌన్ ప్లానింగ్ అధికారులు తీరు ఉంది. నిబంధనలను విరుద్ధంగా నిర్మాణాలు జరక్కుండా చర్యలు చేపట్టాల్సిన వారే చూసి చూడనట్లు వ్యవహరిస్తూ వాటిని వెనక నుండి ప్రోత్సహిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.
నివాస అనుమతులతో వాణిజ్య కాంప్లెక్స్‌లు… డ్రైన్లు, రోడ్లును ఆక్రమించుకుని బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయి. ముడుపులతో కళ్లు మూసుకున్న అధికారులకు ఇవేవీ కనీసం కనిపించడం లేదు. ఎవరైనా ఫిర్యాదులు చేసినా తమను ఎవరు ఏమి చేయలేరు అన్న ధీమా వారిలో కనిపిస్తుంది. ఫిర్యాదులు చేసిn వారికే బెదిరింపులు చేసే విధంగా ఇక్కడ వ్యవహారం సాగుతుంది. అధికారుల నిర్లక్ష్య ధోరణి కారణంగా ప్రభుత్వానికి కోట్ల రూపాయల ఆదాయ నష్టం ఏర్పడుతుంది. అక్రమ భవన నిర్మాణాలు కారణంగా పెను ప్రమాదాలు సంభవించే అవకాశాలు చెంతని కనిపిస్తున్నాయి. ప్రమాదాలు జరిగిన తర్వాత హడావిడి చేసే అధికార యంత్రాంగం ముందుగానే మేల్కోకుండా ఉండడానికి మామూళ్ల మత్తు కమ్మేసింది.
Illegal-Constructions : అన్నీ ఉల్లంఘనలే

భీమవరం పట్టణంలో టౌన్ ప్లానింగ్ నిబంధనలు పూర్తిగా ఉల్లంఘించబడుతున్నాయి. నివాస భవనాలకు అనుమతి తీసుకుని వాణిజ్య కాంప్లెక్స్‌లు, షాపింగ్ మాల్‌లు నిర్మించడం, రాయలం డ్రెయిన్ పై ఆక్రమణలు, సెట్బ్యాక్లు, పార్కింగ్ స్పేస్‌లు వదలకుండా అదనపు అంతస్తులు లేపడం సాధారణమైపోయింది. భీమవరం పట్టణంలోని జువ్వలపాలెం రోడ్డు పద్మాలయ రోడ్డు, సుంకర పద్దయ్య వీధి, వేణుగోపాల స్వామి, చివరికి మున్సిపల్ కార్యాలయం సమీపంలోనే అక్రమ నిర్మాణాల దందా సాగుతుంది. నివాస అనుమతి తీసుకుని కమర్షియల్ భవనాలు దర్జాగా నిర్మించేస్తున్నారు. భవన నిర్మాణ అనుమతులు ఇచ్చిన తర్వాత భీమవరంలో సైట్ ఇన్స్పెక్షన్లు జరగవు. 300 చదరపు మీటర్లలోపు స్థలాల్లో జీ+2కి మాత్రమే అనుమతి ఉన్నా అదనపు అంతస్తులు, రోడ్డు మార్జిన్లు ఆక్రమించి నిర్మాణాలు జరుగుతున్నాయి. పార్కింగ్ సెల్లార్లు లేకుండా, డ్రైనేజీ మార్గాలు మూసివేసి భవనాలు లేస్తున్నారు.
అక్రమ నిర్మాణాల వల్ల పట్టణ ప్రజల జీవనం తీవ్రంగా ప్రభావితమవుతోంది. డ్రైనేజీ సమస్యలు, వర్షాకాలంలో వరదలు, రోడ్లపై ట్రాఫిక్ రద్దీ, పార్కింగ్ సమస్యలు పెరిగాయి. మాస్టర్ ప్లాన్‌లో రెసిడెన్షియల్ జోన్‌గా గుర్తించిన ప్రాంతాల్లో కమర్షియల్ యూస్ కొనసాగుతోంది. కలెక్షన్ కింగ్’లుగా మారిన అధికారులు ముడుపులు తీసుకుని కళ్లు మూసుకుంటున్నారని స్థానికుల ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి.
Illegal-Constructions : భారీ నష్టం సర్కారుక

ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా లేని భవనాలను అక్రమ కట్టడాలను తొలగించాలని గతంలో ఆదేశాలు జారీ చేసిన ఇక్కడ అధికారులు మాత్రం పూర్తిస్థాయి చర్యలు చేపట్టలేదు. అస్తవ్యస్తంగా నిర్మాణాలు కొనసాగుతుండడంతో వాటి వల్ల భవిష్యత్తులో ప్రజా జీవనానికి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. భీమవరం వంటి అభివృద్ధి చెందుతున్న పట్టణం భవిష్యత్తులో ఈ అక్రమ నిర్మాణాల వల్ల భారీ నష్టాన్ని చవిచూడాల్సిన పరిస్థితి ఎదురు కానుంది. భీమవరం అక్రమ నిర్మాణాల రాజధానిగా మారే ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికైనా ఉన్నత స్థాయి అధికారులు స్పందించి ఈ అక్రమ నిర్మాణాలపై చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
