యువతి హత్య…
కారంపూడి (ఆంధ్రప్రభ ) : పల్నాడు జిల్లా కారంపూడి మండలం చింతపల్లి శివారులో ఓ యువతి హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఇనపరాజుపల్లికి చెందిన ఓ యువకుడు చదువు సమయంలో చిలకలూరిపేటకు చెందిన షేక్ హసీనా అనే యువతితో పరిచయం పెంచుకున్నట్లు తెలుస్తోంది. ఇద్దరూ ఒకే తరగతిలో చదివిన సహపాఠులని సమాచారం.
రెండు రోజుల క్రితం యువతి షేక్ హసీనాను కారంపూడి మండలం చింతపల్లి శివారులోని వ్యవసాయ పొలాల వద్దకు తీసుకెళ్లిన అనంతరం ఆమె మృతదేహం లభ్యమైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై యువకుడి పాత్రపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. అయితే హత్యకు గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.
సమాచారం అందుకున్న చిలకలూరిపేట అర్బన్ సీఐ పి. రమేష్ ఆధ్వర్యంలోని పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. హత్యకు గల అసలు కారణాలు, నిందితుడి పాత్రపై పోలీసులు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.
