ప్రియుడికి సందేశాలు?

వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్‌లు
ఫోన్‌లో భార్య పంపిన మెసేజ్‌ చూసి ఖంగుతిన్న భర్త
భర్త పోలీసులకు ఫిర్యాదు.. కేసు నమోదు చేసిన పోలీసులు?
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లు మండలం చిలుకోడులో వెలుగు చూసిన సంచలన ఘటన

మహబూబాబాద్, ఆంధ్రప్రభ: మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం చిలుకోడులో కుటుంబ కలహాలకు సంబంధించిన ఓ ఘటన సంచలనంగా మారింది. తన భార్య ప్రియుడికి పంపినట్లు ఆరోపిస్తున్న వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ సందేశాలను ఆధారంగా చూపిస్తూ ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతామని పోలీసులు తెలిపారు.

బాధితుడు గాదే రాజేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. 2016లో సూర్యాపేట జిల్లాకు చెందిన భవానితో ఆయనకు వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొంతకాలంగా భవానికి ఓ కొరియర్ ఉద్యోగితో సన్నిహిత సంబంధం ఉందని అనుమానం వ్యక్తం చేసిన రాజేశ్వరరావు, ఇటీవల ఈ విషయంపై పెద్దల సమక్షంలో పంచాయతీ కూడా నిర్వహించినట్లు పేర్కొన్నారు.

పంచాయతీ అనంతరం తన అన్నను తీసుకురావడానికి వెళ్తున్న సమయంలో సంబంధిత వ్యక్తి తనను వెంబడించాడని, అనంతరం ఇంటికి చేరుకుని భార్య మొబైల్ ఫోన్ పరిశీలించగా వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లో తనను హత్య చేయాలని సూచించేలా ఉన్నట్లు భావిస్తున్న సందేశాలు కనిపించాయని ఆరోపించారు.

ఆ సందేశాల స్క్రీన్‌షాట్లు తీసుకుని భార్యతో పాటు సంబంధిత వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తొలుత చర్యలు తీసుకోలేదని ఆరోపించిన ఆయన, మరోసారి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడతామని రూరల్ సీఐ హామీ ఇచ్చినట్లు చెప్పారు.

పోలీసులు ఈ వ్యవహారంపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆరోపణల నిజానిజాలు విచారణ అనంతరం తేలాల్సి ఉంది.