కళాశాలలపై హైడ్రా దర్యాప్తు ముమ్మరం
ఒక కళాశాలపై వచ్చిన ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన అక్రమాల గుట్టు
ప్రాథమిక తనిఖీల్లో 52 నకిలీ ఎన్వోసీలు గుర్తింపు.. పోలీసులకు ఫిర్యాదు చేసిన హైడ్రా
తప్పుడు ప్రచారాన్ని ఖండించిన హైడ్రా.. క్యూఆర్ కోడ్‌తో ధ్రువీకరణ సౌకర్యం ఉందని స్పష్టీకరణ
హైదరాబాద్, ఆంధ్రప్రభ: నకిలీ ఫైర్ ఎన్వోసీల వ్యవహారంపై హైడ్రా (HYDRAA) విస్తృత స్థాయిలో దర్యాప్తు చేపట్టింది. ఒక జూనియర్ కళాశాలకు సంబంధించిన ఫైర్ ఎన్వోసీపై వచ్చిన ఫిర్యాదు ఆధారంగా విచారణ ప్రారంభించగా, నగరంలోని మరిన్ని కళాశాలలు కూడా నకిలీ ధ్రువపత్రాలతో ఇంటర్మీడియట్ బోర్డు అనుమతులకు దరఖాస్తు చేసినట్లు ప్రాథమిక విచారణలో గుర్తించినట్లు హైడ్రా గురువారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
హైడ్రా అధికారులు ఇంటర్మీడియట్ బోర్డుతో కలిసి నగరంలోని కళాశాలలు సమర్పించిన ఫైర్ ఎన్వోసీలను పరిశీలిస్తున్నారు. మొదటి దశ తనిఖీల్లో ఎనిమిది కళాశాలలకు చెందిన ఎన్వోసీలు నకిలీవిగా తేలడంతో జూలై 4న నెక్లెస్ రోడ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. అనంతర పరిశీలనలో మరో 44 నకిలీ ఎన్వోసీలు బయటపడగా, వాటి వివరాలను కూడా పోలీసులకు అందజేసినట్లు పేర్కొన్నారు.
ఈ వ్యవహారంలో నకిలీ ధ్రువపత్రాలు రూపొందించిన వారు, వాటిని వినియోగించిన వారి పాత్రపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారని హైడ్రా తెలిపింది. అలాగే ఈ వ్యవహార సమన్వయం కోసం ఇంటర్మీడియట్ బోర్డు ఒక నోడల్ అధికారిని నియమించిందని, హైడ్రాతో కలిసి అన్ని ధ్రువపత్రాల పరిశీలన చేపడుతున్నట్లు వివరించింది.
హైడ్రాపై కొందరు సామాజిక మాధ్యమాలు, ఒక మీడియా సంస్థ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని సంస్థ ఖండించింది. ఎలాంటి ఆధారాలు లేకుండా అధికారులపై ఆరోపణలు చేయడం సరికాదని పేర్కొంది. నకిలీ ఎన్వోసీల అంశాన్ని హైడ్రానే ముందుగా గుర్తించి, నెల రోజుల క్రితమే పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయాన్ని గుర్తు చేసింది.
15 మీటర్ల ఎత్తులోపు భవనాలకు మాత్రమే హైడ్రా ఫైర్ ఎన్వోసీలు జారీ చేస్తుందని, అంతకంటే ఎత్తైన భవనాలకు రాష్ట్ర అగ్నిమాపక శాఖ అనుమతులు ఇస్తుందని స్పష్టం చేసింది. గతంలో జీహెచ్ఎంసీ పేరుతో జారీ చేసినట్లు కనిపించే నకిలీ ధ్రువపత్రాలు కూడా వెలుగులోకి వస్తున్నాయని పేర్కొంది.
అవకతవకలకు తావులేకుండా ఫైర్ ఎన్వోసీల జారీ ప్రక్రియను పూర్తిగా ఆన్లైన్లో నిర్వహిస్తున్నామని, ప్రతి ధ్రువపత్రంపై ఉన్న క్యూఆర్ కోడ్ ద్వారా హైడ్రా వెబ్సైట్లో దాని ప్రామాణికతను ఎవరైనా సులభంగా ధ్రువీకరించుకోవచ్చని హైడ్రా వెల్లడించింది.
