అంబులెన్స్ ఆలస్యం.. ఆటోలో ఆస్పత్రికి తరలింపు..

అంబులెన్స్ ఆలస్యం.. ఆటోలో ఆస్పత్రికి తరలింపు..


మహబూబ్ నగర్,క్రైం, ఆంధ్రప్రభ : మహబూబ్‌నగర్ జిల్లా హాన్వాడ మండలం కొత్తపేట గ్రామానికి చెందిన కామారం శ్రీనివాస్ శనివారం రాత్రి మహబూబ్‌నగర్ నుంచి బైక్‌ పై స్వగ్రామానికి వెళ్తుండగా పిల్లిగుండు అడవి వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. కోస్గి నుండి మహబూబ్ నగర్ వైపు వస్తున్న ఓకారు బైక్‌ను ఢీకొట్టడంతో శ్రీనివాస్‌ తలకు తీవ్ర గాయమైంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చినా.. అత్యవసర సేవలు మాత్రం స్పందించలేదు. ప్రాణాపాయ స్థితిలో రోడ్డు పై బాధితుడు నొప్పులతో విలవిల్లాడుతుండగా అంబులెన్స్ కోసం స్థానికులు దాదాపు అరగంట పాటు ఎదురుచూశారు. అయినా వాహనం అక్కడికి చేరుకోకపోవడంతో చివరకు ఆటోను ఆశ్రయించి మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

సమయానికి చికిత్స అందకపోతే పరిస్థితి విషమించేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీనివాస్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ అత్యవసర వైద్య సేవలపై ప్రచారం చేస్తున్నా.. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం పరిస్థితి దయనీయంగా ఉందని ప్రజలు, స్థానికులు మండిపడుతున్నారు. ప్రమాద సమయంలో ప్రాణాలను కాపాడాల్సిన అంబులెన్స్ సేవలు ఆలస్యంగా స్పందించడం అధికారుల అలసత్వానికి నిదర్శనమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా ప్రతి మండలానికి కనీసం ఒక అంబులెన్స్‌ను అందుబాటులో ఉంచాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply