New H-1B | వీసాలపై ఫీజు పెంచే అధికారం లేదు
New H-1B | వీసాలపై ఫీజు పెంచే అధికారం లేదు
హెచ్-1బీ వీసాకు లక్ష డాలర్లు ఫీజు నిర్ణయం
ట్రంప్ నిర్ణయాన్ని కొట్టేసిన బోస్టన్ కోర్టు
పార్లమెంట్ అనుమతి లేకుండా ఫీజు పెంపు అసాధ్యం
ట్రంప్‌కు పెంచే అధికారం లేదని తీర్పు
వేలాది మంది ఇండియన్స్‌కు ఊరట
ఊపిరి పీల్చుకుంటున్న కంపెనీలు
New H-1B | న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : అమెరికాలో ఐటీ సహా పలు రంగాల్లోని అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీ కార్మికులపై (ముఖ్యంగా భారతీయులపై) తీవ్ర ప్రభావం చూపుతున్న ఒక వివాదాస్పద నిర్ణయానికి అక్కడి ఫెడరల్ కోర్టు బ్రేక్ వేసింది. కొత్త హెచ్-1బీ వీసాల జారీ ప్రక్రియపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 1 లక్ష డాలర్ల (సుమారు రూ.83 లక్షలకు పైగా) భారీ రుసుమును బోస్టన్‌లోని యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి లియో సోరోకిన్ కొట్టివేశారు. అమెరికా పార్లమెంట్ (కాంగ్రెస్) ఎన్నడూ ఆమోదించని ఈ రుసుము పూర్తిగా చట్టవిరుద్ధమైన పన్ను అని న్యాయమూర్తి తన తీర్పులో స్పష్టం చేశారు.
వలస చట్టాల ప్రకారం.. కొంతమంది విదేశీ పౌరుల అమెరికా ప్రవేశం దేశ ప్రయోజనాలకు హానికరం అని భావించినప్పుడు వారిని నియంత్రించే అధికారం అధ్యక్షుడికి ఉంటుందని, ఆ నిబంధన కింద విధించిన చట్టబద్ధమైన ద్రవ్య జరిమానానే ఈ రుసుము అని ట్రంప్ ప్రభుత్వం కోర్టులో గట్టిగా వాదించింది. అయితే, ఈ వాదనను తోసిపుచ్చిన న్యాయమూర్తి సోరోకిన్.. లక్ష డాలర్ల వసూలు విధానం, దాని సారాంశాన్ని బట్టి చూస్తే అది స్పష్టంగా ఒక పన్ను అని తేల్చారు.

New H-1B | నైపుణ్యాలున్న విదేశీయులపై ప్రభావం..
రిపబ్లికన్ అధ్యక్షుడికి సొంతంగా పన్నులు విధించే అధికారాన్ని కాంగ్రెస్ ఇవ్వలేదని, అందువల్ల దీన్ని యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ లేదా ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ అమలు చేయలేవని స్పష్టం చేశారు. జాతీయ అత్యవసర పరిస్థితుల చట్టం కింద ట్రంప్ విధించిన భారీ సుంకాలను కొట్టివేస్తూ యూఎస్ సుప్రీంకోర్టు గత ఫిబ్రవరిలో ఇచ్చిన తీర్పును ఉటంకిస్తూ.. వలస చట్టాల చాటున పన్నులు వసూలు చేసే అధికారం ట్రంప్‌కు లేదని న్యాయమూర్తి తీర్పునిచ్చారు. ఈ తీర్పుపై వైట్ హౌస్ ప్రతినిధి టేలర్ రోజర్స్ స్పందిస్తూ.. అమెరికా ప్రయోజనాలకు విఘాతం కలిగించే విదేశీయుల ప్రవేశాన్ని పరిమితం చేయడానికి అధ్యక్షుడు ట్రంప్‌కు స్పష్టమైన చట్టపరమైన హక్కులు ఉన్నాయని, ఈ తీర్పుపై తాము ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్‌కు వెళ్తామని, అక్కడ తమకు అనుకూలమైన నిర్ణయం వస్తుందనే నమ్మకం ఉందని తెలిపారు.


గత సెప్టెంబర్‌లో ఈ భారీ రుసుమును ప్రకటిస్తూ ట్రంప్.. “అమెరికన్ కార్మికులకు అండగా నిలవాల్సింది పోయి, వారి స్థానంలో తక్కువ వేతనాలు, తక్కువ నైపుణ్యాలు ఉన్న విదేశీయులను నియమించుకోవడానికి కంపెనీలు హెచ్ 1 బి కార్యక్రమాన్ని ఉద్దేశపూర్వకంగా దుర్వినియోగం చేస్తున్నాయి” అని ఆరోపించారు.
click here to read more : New H-1B | వీసాలపై ఫీజు పెంచే అధికారం లేదు
