వృద్ధ దంపతులకు నేస్తం ట్రస్ట్ ఆర్థిక సహాయం

బూర్గంపాడు, ఆంధ్రప్రభ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం మోరంపల్లి బంజర్ గ్రామానికి చెందిన నేస్తం వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భద్రాచలం రాజుపేట ఎమ్మెల్యే కాలనీలో నివసిస్తున్న గేదెల లక్ష్మీ, లక్ష్మీనారాయణ వృద్ధ దంపతులకు రూ.10,000 ఆర్థిక సహాయం అందించారు.

లక్ష్మీ గత ఆరు సంవత్సరాలుగా ఎడమ చేయి, కాలు పక్షవాతం రావడంతో మంచానికే పరిమితమై తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమె భర్త లక్ష్మీనారాయణ (73) చిన్నతనంలో పోలియో బారిన పడటంతో కుడి చేయి పనిచేయడం లేదు. అదనంగా ఇద్దరూ షుగర్ వ్యాధితో బాధపడుతూ, వృద్ధాప్యంలో ప్రభుత్వ ఆసరా పింఛన్‌పై ఆధారపడి జీవిస్తున్నారు.

ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ బత్తుల రామకొండారెడ్డి మాట్లాడుతూ, ఈ దంపతుల పరిస్థితి హృదయ విదారకమని, వారికి వచ్చే పింఛన్‌తో వైద్యం చేయించుకునే స్థోమత కూడా లేదని తెలిపారు. భార్య మంచానికే పరిమితమవడంతో లక్ష్మీనారాయణ ఆమెను ఆరు సంవత్సరాలుగా ఎంతో ప్రేమతో, శ్రద్ధగా చూసుకుంటూ ఉండటం వైవాహిక బంధానికి ఆదర్శమని పేర్కొన్నారు.

స్థానికులు ఈ విషయాన్ని ట్రస్ట్ దృష్టికి తీసుకురావడంతో శనివారం వారి నివాసానికి వెళ్లి రూ.10,000 ఆర్థిక సహాయాన్ని అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ వైస్ చైర్మన్ చింత అంకిరెడ్డి, గౌరవ సలహాదారులు బత్తుల రామకొండారెడ్డి, సభ్యులు కైపు రమేష్ రెడ్డి, దుగ్గిరెడ్డి బాలనారాయణ రెడ్డి, స్థానికులు రంగారావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply