ఖిల్లాపైకి ఎమ్మెల్యే వసంత, కలెక్టర్ లక్ష్మీశ, ట్రెక్కింగ్..

ఖిల్లాపైకి ఎమ్మెల్యే వసంత, కలెక్టర్ లక్ష్మీశ, ట్రెక్కింగ్..
- కొండపల్లి బొమ్మల పండుగలో భాగంగా..
ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని పురస్కరించుకుని కొండపల్లిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన బొమ్మల మేళాలో భాగంగా శనివారం ఉదయం కొండపల్లి ఖిల్లాపైకి మెట్ల మార్గం ద్వారా హెరిటేజ్ ట్రెక్కింగ్ నిర్వహించారు. మైలవరం శాసనసభ్యుడు వసంత వెంకట కృష్ణప్రసాద్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశతో కలిసి ట్రెక్కింగ్ చేశారు. ఖిల్లా రోడ్డు నుంచి మెట్ల మార్గం గుండా అటవీ ప్రాంతంలో ఎత్తయిన కొండను అధిరోహించారు.
56 ఏళ్ల వయస్సులో నడుముకు రోప్ కట్టుకుని కొండను ఎక్కి, దిగారు. జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. జై అమరావతి అంటూ నినదించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత మాట్లాడుతూ అమరావతి రాజధాని ప్రాంతంలో చారిత్రాత్మక కొండపల్లి ఖిల్లా ఉత్తమమైన ట్రెక్కింగ్ ప్రదేశమన్నారు.

ఇది ప్రకృతి సౌందర్యం, కొండలు, ప్రాచీన కోట శిథిలాలతో సాహసికులకు అద్భుతమైన మధురానుభూతిని ఇస్తుందన్నారు. ప్రకృతి రమణీయ ప్రదేశాలలో సుదీర్ఘమైన, శ్రమతో కూడిన నడకతో శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసానికి దోహదం చేస్తుందన్నారు. ప్రకృతిని ఆస్వాదించడానికి ఒక గొప్ప సాహస యాత్ర అని, చరిత్రకారులకు, సాహస యాత్రికులకు మరపురాని జ్ఞాపకాలను మిగుల్చుతుందన్నారు.

గత ప్రభుత్వంలో కొండపల్లి కోటను నిర్లక్ష్యం…

గత ఐదేళ్ల వైసీపీ పాలనలో కొండపల్లి కోట అభివృద్ధి పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందన్నారు. 2014-19 మధ్య కాలంలో సీఎం చంద్రబాబు టీడీపీ ప్రభుత్వ హయంలో కొండపల్లి కోటకు పూర్వవైభవం తెచ్చేదిశగా అడుగులు వేశారన్నారు. రూ.6 కోట్లు వెచ్చించి లేజర్ షో ఏర్పాటు చేశారన్నారు. గత ప్రభుత్వంలో రూ.10 లక్షల శాసనసభ్యుడి నిధులు మంజూరు చేసి ఖిల్లాపై అభివృద్ధి పనులు చేశామన్నారు.
కూటమి ప్రభుత్వంలో కొండపల్లి కోటకు పూర్వవైభవం…
మళ్ళీ కూటమి ప్రభుత్వ హయాంలో పర్యాటకంగా అభివృద్ధితో పాటు కొండపల్లి కోట, ఖిల్లా వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు కృషి జరుగుతోందన్నారు. దీన్ని పర్యాటక కేంద్రంగా సంపూర్ణంగా అభివృద్ధి చేసేందుకు సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. కొండపల్లి కోట చరిత్రను, ప్రాముఖ్యతను వివరించారు. ఇక్కడ మరోసారి డీఆర్సీ సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. అటవీ, పురావస్తు, పర్యాటక శాఖ అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు.
నడకదారి మెట్ల మార్గం అభివృద్ధి చేస్తామన్నారు. ఖిల్లాపైకి వచ్చే రోడ్డు మార్గంలో బూడిద చెరువు ఉన్నందున ప్రత్యామ్నాయ రోడ్డు ఏర్పాటుకు ప్రతిపాదనలు చేస్తామన్నారు. మెట్ల మార్గం నుంచి రోప్ వే ఏర్పాటు పరిశీలనలో ఉందన్నారు. పర్యాటకులను ఆకర్షించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. కొండపల్లి ఖిల్లా సమగ్రాభివృద్ధికి, పునరుద్ధరణకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, అటవీ శాఖ, పర్యాటక శాఖ అధికారులు పాల్గొన్నారు.
