NEET Paper Leak | కేంద్ర మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్

NEET Paper Leak | కేంద్ర మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్

NEET Paper Leak | హైదరాబాద్, ఆంధ్రప్రభ: హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో ఆదివారం శాంతియుత నిరసన కార్యక్రమం నిర్వహించారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీ ఘటనపై నిరసన వ్యక్తం చేస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు, నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ‘రాజ్యాంగం జిందాబాద్’ నినాదాలతో నిరసన వ్యక్తం చేశారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత లోపించడం, వరుసగా పేపర్ లీకేజీ ఘటనలు చోటుచేసుకోవడం వల్ల లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

నీట్ వంటి జాతీయ స్థాయి పరీక్షల విశ్వసనీయత దెబ్బతింటోందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేయాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమానికి ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ మద్దతు ప్రకటించినట్లు నిర్వాహకులు తెలిపారు. అలాగే పార్టీ అధికార ప్రతినిధి విజేత్ దహియా కూడా కార్యక్రమంలో పాల్గొననున్నట్లు వెల్లడించారు. ముందస్తుగా పోలీసుల అనుమతితో నిర్వహించిన ఈ ఆందోళనలో వందలాది మంది విద్యార్థులు, నిరుద్యోగ యువత స్వచ్ఛందంగా పాల్గొని తమ నిరసనను తెలియజేశారు.