ప్రైవేటు ఆస్పత్రిపై స్థానికుల ఆరోపణలు..
కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
చిట్టినగర్, ఆంధ్రప్రభ : విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 47వ డివిజన్ కుండల మార్కెట్ ప్రాంతంలోని సైడ్ కాల్వలో మంగళవారం ఉదయం బయోమెడికల్ వ్యర్థాలు కనిపించడం స్థానికుల్లో ఆందోళన కలిగించింది. కాల్వలో వాడి పడేసిన గ్లౌజులు, సిరంజీలు, రక్తపు మరకలతో ఉన్న వస్త్రాలు, ప్లాస్టిక్ కవర్లు కనిపించాయి.
బయోమెడికల్ వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ పారవేయకుండా, బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ నిబంధనలు–2016 ప్రకారం శాస్త్రీయంగా సేకరించి, రవాణా చేసి, నిర్వీర్యం చేయాల్సి ఉంటుంది. దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులన్నీ ఈ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి.
నిబంధనల ప్రకారం వ్యర్థాలను వేర్వేరు రంగుల సంచుల్లో సేకరించాలి. ఎరుపు రంగు సంచుల్లో సిరంజీలు, ఇంట్రావీనస్ ట్యూబులు, ఐవీ సెట్లు, యూరిన్ బ్యాగులు, గ్లౌజులు వంటి ప్లాస్టిక్ వ్యర్థాలు, పసుపు రంగు సంచుల్లో రక్తంతో కూడిన వ్యర్థాలు, శరీర అవశేషాలు, రసాయన వ్యర్థాలు, తెలుపు రంగు కంటైనర్లలో బ్లేడ్లు, సూదులు వంటి పదునైన లోహ వస్తువులను వేయాల్సి ఉంటుంది.
అయితే, ఈ నిబంధనలను ఉల్లంఘిస్తూ కుండల మార్కెట్ సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి నుంచి బయోమెడికల్ వ్యర్థాలను కాల్వలో పారవేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. వైద్య విద్య అభ్యసించిన వారు ఇలాంటి నిర్లక్ష్యానికి పాల్పడటం బాధాకరమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై డ్రగ్ ఇన్స్పెక్టర్, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వెంటనే దర్యాప్తు చేపట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
