భద్రాద్రి జిల్లాలో స్వల్ప భూకంపం..
బూర్గంపాడు, ఆంధ్రప్రభ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిసర ప్రాంతాల్లో ఆదివారం తెల్లవారుజామున స్వల్ప భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ (ఎన్‌సీఎస్) వెల్లడించింది.
ఆదివారం తెల్లవారుజామున 2.26 గంటలకు (ఐఎస్‌టీ) భూమి స్వల్పంగా కంపించినట్లు అధికారులు తెలిపారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.8గా నమోదైంది.
భూకంప కేంద్రం భద్రాద్రి కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లో, రాజమహేంద్రవరం (రాజమండ్రి) నగరానికి వాయువ్య దిశగా సుమారు 111 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు ఎన్‌సీఎస్ పేర్కొంది.
జిల్లాలోని కొత్తగూడెం, బూర్గంపాడు, పాల్వంచ, భద్రాచలం తదితర ప్రాంతాల్లో కొద్ది సెకన్ల పాటు ప్రకంపనలు అనుభూతి కావడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. పలువురు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
అయితే ఈ స్వల్ప భూకంపం వల్ల ఎలాంటి ప్రాణనష్టం గానీ, ఆస్తి నష్టం గానీ సంభవించలేదని అధికారులు స్పష్టం చేశారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.
