Narendra Modi Record | నెహ్రూ రికార్డును అధిగమించనున్న ప్రధాని మోడీ
Narendra Modi Record | నెహ్రూ రికార్డును అధిగమించనున్న ప్రధాని మోడీ
Narendra Modi Record | జూన్ 10 నాటికి ప్రధానిగా 4,399 రోజులు పూర్తి
దేశ రాజకీయ చరిత్రలో అరుదైన మైలురాయి
నెహ్రూ, మోడీ రాజకీయ ప్రయాణాల్లో స్పష్టమైన వ్యత్యాసం
అభివృద్ధి మంత్రంతో దేశ రాజకీయాల్లో మోడీ మార్క్
ఆర్టికల్ 370 రద్దు నుంచి రామమందిరం వరకు చరిత్రాత్మక నిర్ణయాలు
Narendra Modi Record | న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ ప్రతినిధి: దేశ రాజకీయ చరిత్రలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరో అరుదైన మైలురాయిని అందుకోనున్నారు. దేశంలో అత్యధిక కాలం నిరంతరాయంగా అధికారంలో కొనసాగిన ప్రజాస్వామ్యయుత ప్రధానమంత్రిగా జవహర్‌లాల్ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును జూన్ 10న మోడీ అధిగమించనున్నారు.
దేశంలో మొదటి సాధారణ ఎన్నికలు 1951-52లో జరిగాయి. ఆ ఎన్నికల అనంతరం తొలిసారిగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రధానిగా నెహ్రూ మే 13, 1952న ప్రమాణ స్వీకారం చేశారు. నాటి నుండి మే 27, 1964న ఆయన మరణించే వరకు.. మొత్తం 4,398 రోజుల పాటు ఎలాంటి విరామం లేకుండా నెహ్రూ ప్రధానిగా కొనసాగారు.
మోడీ రికార్డు..
నరేంద్ర మోడీ మే 26, 2014న తొలిసారిగా ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఈ ఏడాది జూన్ 10 నాటికి విరామం లేకుండా 4,399 రోజులు పూర్తి చేసుకోనున్నారు. దీంతో నెహ్రూ రికార్డును ఒక్క రోజు తేడాతో అధిగమించి, దేశంలోనే సుదీర్ఘకాలం నిరంతరాయంగా పాలించిన ఏకైక ప్రజాస్వామ్య అధినేతగా మోడీ నిలవనున్నారు. కాగా, నెహ్రూ కుమార్తె ఇందిరా గాంధీ జనవరి 24, 1966 నుండి మార్చి 24, 1977 వరకు వరుసగా 4,077 రోజుల పాటు ప్రధానిగా సేవలందించారు.
నెహ్రూను అధిగమించనున్న ప్రధాని మోడీ
ఈ నెల 10 నాటికి ప్రధానిగా మోడీ 4,399 రోజులు పూర్తి చేసుకోనున్నారు. ప్రధానిగా నెహ్రూ 4,398 రోజుల పాటు పదవిలో కొనసాగారు.
భిన్నమైన రాజకీయ సిద్ధాంతాలు..
నెహ్రూ, మోడీ.. ఇద్దరూ భారతీయ రాజకీయాలను దశాబ్దాల పాటు శాసించినవారే. అయితే, ఈ ఇద్దరు నేతల మధ్య కేవలం పదవీ కాలంలోనే కాదు.. దేశ నిర్మాణంలో పౌరుల పాత్రను వీక్షించే విధానంలోనూ స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తుంది.
కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించిన నెహ్రూకు ఆ కాలంలో పెద్దగా జాతీయ స్థాయి ప్రతిపక్షం ఎదురుకాలేదు. ఆయన సెక్యులర్ ఐక్యత సిద్ధాంతంతో దేశాన్ని నడిపించారు. అత్యంత తీవ్రమైన రాజకీయ పోటీ, ప్రాంతీయ పార్టీల ఆధిపత్యం ఉన్న తరుణంలో మోడీ ఎదిగారు. గుజరాత్ సీఎంగా వరుసగా మూడుసార్లు గెలిచారు. 2014లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏను ఓడించి బీజేపీకి స్పష్టమైన మెజారిటీ తెచ్చిపెట్టారు. అభివృద్ధి మంత్రం, హిందుత్వ సాంస్కృతిక జాతీయవాదంతో మోడీ దేశ రాజకీయాలను మార్చేశారు.
మోడీ మార్క్ నిర్ణయాలు..
మోడీ పాలనలో ఎన్నో సాధ్యమయ్యాయి. జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు, ముస్లిం మహిళలకు ఊరటనిస్తూ ట్రిపుల్ తలాక్ నిషేధం, అలాగే సుప్రీంకోర్టు తీర్పు అనంతరం అయోధ్యలో రామమందిర నిర్మాణం వంటి చరిత్రాత్మక మార్పులు సాధ్యపడ్డాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి జూన్ 10న ప్రధాని మోడీ సాధించబోయే అరుదైన రికార్డు చారిత్రక మైలురాయిగా నిలిచిపోనుంది.
