Nandyala | అధర్మంపై ధర్మం గెలిచింది…

Nandyala | అధర్మంపై ధర్మం గెలిచింది…
- చంద్రబాబుపై స్కిల్ కేసు కొట్టివేతపై హర్షం…
- జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి…
Nandyala | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై గత ప్రభుత్వం అక్రమంగా బనాయించిన ‘స్కిల్ డెవలప్‌మెంట్’ కేసును విజయవాడ ఏసీబీ కోర్టు కొట్టివేయడం పట్ల జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండీ ఫిరోజ్ హర్షం వ్యక్తం చేశారు. ఇవాళ నంద్యాలలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈసందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ… రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే గత వైకాపా ప్రభుత్వం స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్ట్ చేసి 53 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉంచిందని గుర్తు చేశారు.
ఎటువంటి ఆధారాలు లేకుండా, కేవలం రాజకీయ ఉనికి కోసం అల్లిన ఈ అబద్ధపు కేసు చివరకు నీటి బుడగలా పేలిపోయిందన్నారు. సీఐడీ రిపోర్టు ఆధారంగా ఈ కేసులో ‘మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్’ జరిగినట్లు పరిగణించి, చంద్రబాబు నాయుడు సహా 37మందిపై ఉన్న విచారణను ఏసీబీ కోర్టు క్లోజ్ చేసిందని తెలిపారు. చట్టం ముందు ఎవరైనా సమానమే అని, చంద్రబాబు నాయుడు నిజాయితీ ఈరోజు మరోసారి నిరూపితమైందని ఫిరోజ్ పేర్కొన్నారు. ఈ తీర్పు వెలువడడానికి ముందే, కేసును అడ్డుకోవాలని ప్రయత్నించిన అప్పటి స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ అజయ్ రెడ్డి పిటిషన్‌ను కోర్టు తిరస్కరించడాన్ని ఆయన స్వాగతించారు. చివరగా, సత్యమే జయిస్తుందని సత్యమేవ జయతే ఈ తీర్పు ద్వారా స్పష్టమైందని, చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
