చిట్‌ఫండ్ ఆరోపణలపై ప్రధానోపాధ్యాయుడు సస్పెండ్

చిట్‌ఫండ్ ఆరోపణలపై ప్రధానోపాధ్యాయుడు సస్పెండ్

నాంపల్లి, ఆంధ్రప్రభ: విధి నిర్వహణలో ఉండగానే అనధికారికంగా చిట్‌ఫండ్ వ్యాపారం నిర్వహించినట్లు వచ్చిన ఆరోపణలు రుజువుకావడంతో ఓ ప్రధానోపాధ్యాయుడిని విద్యాశాఖ అధికారులు సస్పెండ్ చేశారు.

నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం శర్వాపురం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న బెక్కం వీరయ్య ప్రభుత్వ ఉద్యోగ నియమావళిని ఉల్లంఘించి, పెద్ద ఎత్తున ఆర్థిక లావాదేవీలు, చిట్‌ఫండ్ వ్యాపారం నిర్వహిస్తున్నారని గతంలో కొందరు బాధితులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా అధికారులు చండూరు ఆర్డీవో శ్రీదేవిని విచారణ అధికారిగా నియమించారు. ఆర్డీవో నిర్వహించిన సమగ్ర విచారణలో వీరయ్యపై వచ్చిన ఆరోపణలు నిజమేనని తేలింది. విచారణ నివేదిక ఆధారంగా ఉన్నతాధికారులు సదరు ప్రధానోపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రభుత్వ ఉద్యోగులు ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ప్రైవేట్ లేదా వ్యాపార కార్యకలాపాల్లో పాల్గొనడం పూర్తిగా నిబంధనలకు విరుద్ధమని మండల విద్యాధికారి కె. మల్లికార్జున్ రావు తెలిపారు.