మోత్కూర్ మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక వాయిదా!

మోత్కూర్ మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక వాయిదా!

  • ఉదయం కోరం ఉన్నా…వాయిదా పడ్డ ఎన్నిక
  • కౌన్సిలర్లలో కుదరని సయోధ్య
  • మధ్యాహ్నం మెజారిటీ కౌన్సిలర్ల గైర్హాజరు

మోత్కూర్, ఆంధ్రప్రభ: మోత్కూర్ మున్సిపాలిటీలో 4 కో ఆప్షన్ స్థానాల ఎన్నికకు సంబంధించి మంగళవారం చైర్మన్ గడ్డం స్వప్న సోమనర్సయ్య అధ్యక్షతన కౌన్సిల్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. 12 గంటలకు నిర్వహించిన సమావేశంలో చైర్మన్, వైస్ చైర్మన్ తో పాటు మరో 9 మంది కౌన్సిలర్లు పాల్గొనగా, రిజిస్టర్ లో సంతకాలు చేసిన అనంతరం మెజారిటీ కౌన్సిలర్లు భోజన విరామం అనంతరం సమావేశానికి హాజరు అవుతామని చెప్పడంతో సమావేశం కాస్త మధ్యాహ్నం 2 .30 కి వాయిదా వేస్తున్నట్లు కమిషనర్ ప్రకటించారు.

భోజన విరామం అనంతరం 3 గంటలకు బీఆర్ఎస్ కౌన్సిలర్లు సుల్తాన్ స్వామి, కొండ శోభ, నల్ల మధులు మున్సిపల్ కార్యాలయం ఆవరణకు చేరుకున్నారు. 2.30 నుండి 3.30 వరకు సమావేశ హాల్లోకి కౌన్సిలర్లు ఒక్కరూ కూడా రాకపోవడంతో సమావేశం మళ్లీ వాయిదా వేస్తున్నట్లు కమిషనర్ సతీష్ కుమార్ ప్రకటించారు. తదుపరి సమావేశం తేదీని త్వరలోనే ప్రకటిస్తామని కమిషనర్ తెలిపారు.

కో ఆప్షన్ స్థానాల పై … కుదరని సయోధ్య..?

4 కో ఆప్షన్ స్థానాలకు ఎన్నికకు ఏప్రిల్ 23 దరఖాస్తుల గదువులోపు 16 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు.గత 12 రోజులుగా కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక కోసం హై ‘డ్రామా’ నడవగా…ఎట్టకేలకు మంగళవారం నిర్వహించిన సమావేశంలో అభ్యర్థులు ఖరారు అవుతారని ఎదురుచూపులు చూసిన ఆశావాహుల్లో …కోరం ఉన్నా (11 మంది కౌన్సిలర్లు హజరైనప్పటికి)సమావేశం కాస్త వాయిదా పడడంతో అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది.

ఎమ్మెల్యే జాబితా పై వ్యతిరేకత..?

తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ 4 కో ఆప్షన్ స్థానాలకు మహ్మద్ అలీ,ఎం డి పర్వీన్ సుల్తానా, ఎడ్ల శ్రీనివాస్, పోలినేని ఆనందమ్మ ల పేర్లు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వంగాల సత్యనారాయణ, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి అవిశెట్టి అవిలిమల్లు ల ద్వారా చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లకు సూచించగా.. మైనారిటీ కోటాలో ఇద్దరి సభ్యుల విషయంలో ఎలాంటి అభ్యంతరం తెలపని కౌన్సిలర్లు కాస్త ప్రజాప్రతినిధుల కోటాలో సూచించిన ఎడ్ల శ్రీనివాస్, పొలినేని ఆనందమ్మ లను వ్యతిరేకిస్తూ వారి స్థానంలో అంబటి విజయ్ కుమార్(కొండగడప),కారుపోతుల శిరీష లేదా లెంకల సుజాత లను నియమించాలని కోరుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.

ఎమ్మెల్యే సామెల్ సూచించిన అభ్యర్థుల విషయంలో మున్సిపల్ చైర్మన్, వైస్ ఛైర్మన్ తో పాటు కొంతమంది కౌన్సిలర్లు ఒప్పుకోగా…మినహా కొంతమంది కౌన్సిలర్లు ససేమిరా ఒప్పుకోకపోవడంతో వీరి మధ్య సయోధ్య కుదరకపోవడంతో మెజారిటీ కౌన్సిలర్లు మధ్యాహ్నం తర్వాత సమావేశానికి గైర్హాజరు కావడంతో కమిషనర్ సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

క్యాష్ కొట్టు…కో ఆప్షన్ పట్టు..?

మున్సిపల్ కో ఆప్షన్ పదవుల కోసం క్యాష్ కొట్టు…కో ఆప్షన్ పట్టు అన్న చందంగా మంగళవారం జరిగిన సమావేశం తలపించింది. ఎమ్మెల్యే సూచించిన అభ్యర్థులకు …కౌన్సిలర్లు మద్దతు ఇవ్వమని బహిరంగంగా తేల్చి చెప్పడంతో పాటు,డబ్బులు ఇవ్వనిదే కో ఆప్షన్ పదవులు రావని కొంతమంది ఆశావహులు ఇప్పటికే మిన్నకుండా ఉన్నట్లు సమాచారం. కో ఆప్షన్ పదవి కోసం పలానా వ్యక్తి ఇంత ఇస్తున్నారు.. మీరు ఇంత ఇస్తారా అని నేరుగా అడుగుతున్నారని ఓ ఆశావాహుడు విలేకరులతో వాపోయాడు.

ఎన్నిక అవరణకు వచ్చిన ఆశావాహులు..!

మున్సిపల్ కో ఆప్షన్ కోసం 16 మంది దరఖాస్తు చేయగా…మంగళవారం నిర్వహించిన ప్రత్యేక సమావేశం వద్దకు కో ఆప్షన్ ఆశావహులు మహ్మద్ అలీ, ఎండీ పర్వీన్ సుల్తానా భర్త సమీర్,ఎడ్ల శ్రీనివాస్, పోలినేని ఆనందమ్మ ,అంబటి విజయ్ కుమార్ లు మాత్రమే అక్కడికి చేరుకొని ఆశగా ఎదురు చూశారు.ఎట్టకేలకు సమావేశం వాయిదా పడడంతో నిరాశగా వెళ్లిపోయారు.