Nalgonda | వ్యక్తి దారుణ హత్య

Nalgonda | ఉమ్మడి నల్లగొండ బ్యూరో, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా కేంద్రంలో గురువారం రాత్రి ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో చంద్రు (45) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పండుగ రోజు జరిగిన ఈ హత్య తీవ్ర సంచలనం సృష్టించింది. వ్యక్తికి సంబంధించి సీఐ రాజశేఖర్ రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి గ్రామానికి చెందిన చంద్రు భార్య పిల్లలతో కలిసి రైల్వే కాంట్రాక్టర్ వద్ద కూలి పనిచేసేందుకు వచ్చాడు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మరో కూలి ముఠా ఇక్కడ పనిచేస్తుంది అని చెప్పారు.
గురువారం పండుగ సందర్భంగా మద్యం మత్తులో ఇరు వర్గాల వారు కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో చంద్రు తీవ్ర గాయాలపాలై మరణించాడని సిఐ రాజశేఖర్ రెడ్డి చెప్పారు. ఈ ఘటనలో చంద్రు అన్నతో పాటు వారి మెస్త్రికి గాయాలు కాగా, వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చంద్రుని దారుణంగా హత్య చేసిన కేసులో పోలీసులు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్టు సమాచారం.
