క్రీడా ఆణిముత్యాలను వెలికి తీయడమే లక్ష్యంగా…

క్రీడా ఆణిముత్యాలను వెలికి తీయడమే లక్ష్యంగా…

ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్

మక్తల్, ఆంధ్ర‌ప్ర‌భ : గ్రామీణ ప్రాంతాల్లో మట్టిలో మాణిక్యం లాంటి క్రీడాకారులు ఎందరో ఉన్నారని అలాంటి ఆణిముత్యాలను వెలికి తీయడమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్ నిర్వహిస్తున్నట్లు మక్తల్ మాజీ ఎంపీపీ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొండయ్య అన్నారు. ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్ లో క్రీడాకారులు వ్యాయామ ఉపాధ్యాయులంతా భాగస్వాములై పోటీలను విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

మంగళవారం మక్తల్ పట్టణంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు,మున్సిపల్ కౌన్సిలర్ బి. రాజశేఖర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డితో కలిసి ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చిన్న చిన్న దేశాలు ఒలంపిక్స్ లో పథకాల పంట పండిస్తుంటే కొంతవరకు మన దేశం పథకాలు సాధించడంలో వెనుకబడి ఉందని అన్నారు .

అందుకే ప్రపంచ స్థాయిలో మెరుగైన క్రీడా ప్రదర్శన ద్వారా పథకాలు సాధించే లక్ష్యంతో గ్రామీణ స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు క్రీడా ఆణిముత్యాలను వెలికి తీయడమే లక్ష్యంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్ పేరిట ఏప్రిల్ 9 నుండి 24వ తేదీ వరకు క్రీడా పోటీలను పార్లమెంటు సభ్యులు డికె.అరుణమ్మ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. 16 నుండి 40 సంవత్సరాల లోపు క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొనవచ్చని ఆయన తెలిపారు.

క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, రన్నింగ్ పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. పురుషులకు, మహిళలకు వేరువేరుగా పోటీలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. మండల స్థాయి, నియోజకవర్గస్థాయి, పార్లమెంటు స్థాయిలో ఈ క్రీడా పోటీలు ఉంటాయన్నారు. క్రీడాకారులు క్యూఆర్ కోడ్ ను ఉపయోగించి పేర్లను నమోదు చేసుకోవాల్సిందిగా ఆయన సూచించారు. ఈ పోటీలు పారదర్శకంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. క్రీడాకారుల ప్రతిభను ఆధారంగా మండల నియోజకవర్గ పార్లమెంటు స్థాయిలో ఎంపిక చేసి జాతీయ స్థాయిలో రాణించేందుకు అవకాశం కల్పిస్తామని అన్నారు.

దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున జరగనున్న ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్ లో క్రీడాకారులు వ్యాయామ ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొని పోటీలను విజయవంతం చేయాలని కోరారు .క్రీడా పోటీలు విజయవంతం చేయడానికి బీజేపీ నాయకులు కార్యకర్తలు క్షేత్రస్థాయిలో కృషి చేయాలని అన్నారు. గ్రామాల్లో క్రీడాకారులంతా ఈ పోటీలో పాల్గొనే విధంగా పార్టీ శ్రేణులు వారిని ప్రోత్సహించాలన్నారు. మండల నియోజకవర్గ స్థాయిలో పార్లమెంటు స్థాయిలో గెలుపొందిన క్రీడాకారులను జాతీయస్థాయి పోటీలకు పంపడం జరుగుతుందన్నారు.

విజేతలను ప్రోత్సహించేందుకు బహుమతులు అందజేయనున్నట్లు కొండయ్య వెల్లడించారు .ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి జి. బలరామిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు కర్ని స్వామి ,బీజేవైఎం జిల్లా అధ్యక్షులు భరత్, మున్సిపల్ కౌన్సిలర్లు పీకే .నరసింహ, టప్ప కృష్ణ, మహాద్యార్ సర్పంచ్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, కనకరాజు, ప్రతాపరెడ్డి ,కుర్వ హన్మంతు, కావలి వెంకటేష్, కొండ విజయకుమార్, వన్నవాడ శ్రీకాంత్, జయానందన్ రెడ్డి, నరేందర్, మంజు రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్ వాల్ పోస్టర్లను విడుదల చేశారు.