NAAC ‘A’ Grade | క్రీడాకారుల భద్రతే లక్ష్యం..

NAAC ‘A’ Grade | క్రీడాకారుల భద్రతే లక్ష్యం..

NAAC ‘A’ Grade | కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : క్రీడల ప్రోత్సాహక కార్యక్రమాల ద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభావంతులైన క్రీడాకారులను తయారు చేయడమే లక్ష్యంగా భారత క్రీడా ప్రాధికార సంస్థ (SAI) దేశ వ్యాప్తంగా పలు పథకాలను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా 27 క్రీడా విభాగాల్లో జూనియర్, సబ్‌–జూనియర్ వయసు క్రీడాకారుల కోసం SAI ట్రైనింగ్ సెంటర్లు(Training Centres) (STCs) నిర్వహిస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో 2001లో SAI ట్రైనింగ్ సెంటర్ స్థాపించారు. ప్రస్తుతం ఇది కర్నూలు నగరంలోని క్లబ్‌ రోడ్డు వద్ద ఉన్న జిల్లా క్రీడా మైదానం నుంచి పని చేస్తోంది. ఈ కేంద్రంలో హ్యాండ్‌బాల్, తైక్వాండో విభాగాల్లో మొత్తం 41 మంది నివాస క్రీడాకారులు శిక్షణ పొందుతున్నారు. ఇందులో హ్యాండ్‌బాల్‌లో 21 మందికి అనుమతి ఉండగా 20 మంది, తైక్వాండో(Taekwondo)లో 20 మందికి అనుమతి ఉండగా అందరూ ప్రస్తుతం శిక్షణలో ఉన్నారు.

అయితే, కర్నూలు ఎస్‌టీసీకి చెందిన హాస్టల్ భవనం నిర్మాణ పరంగా తీవ్రంగా దెబ్బతిన్నట్లు తేలింది. గతంలో మరమ్మతులు చేపట్టినప్పటికీ, హాస్టల్ గదులు, వినోద ప్రాంతం, బాల్కనీల్లోని స్లాబ్‌లు మరింత బలహీనంగా మారాయి. ఇది నివాస క్రీడాకారుల ప్రాణ భద్రతకు తీవ్రమైన ప్రమాదంగా మారింది.

నిర్మాణ భద్రతపై కీలక ఆందోళనలు:

పలు విభాగాల్లో స్లాబ్‌లు తీవ్రంగా దెబ్బతినడం, భవనం కూలిపోయే పరిస్థితులు.. నివాసానికి అనర్హమైన పరిస్థితులు.. ఈ నేపథ్యంలో విషయాన్ని ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) క్రీడా ప్రాధికార సంస్థ (SAAP) దృష్టికి తీసుకెళ్లగా, కర్నూలు ఎస్‌టీసీని తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయానికి (ఎస్‌వీ యూనివర్సిటీ) తరలించాలని ప్రతిపాదించింది.

అనంతరం బెంగళూరులోని SAI ప్రాంతీయ కేంద్రం (NSSC) అధికారులు తనిఖీ నిర్వహించగా, ఎస్‌వీ యూనివర్సిటీలో ఉన్న క్రీడా, నివాస సౌకర్యాలు క్రీడాకారుల శిక్షణకు అనుకూలంగా ఉన్నట్లు నిర్ధారించారు.

తిరుపతిలోని ఎస్‌వీ యూనివర్సిటీ NAAC ‘A’ గ్రేడ్(NAAC ‘A’ Grade) పొందిన రాష్ట్ర విశ్వవిద్యాలయం. 100 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ యూనివర్సిటీలో 30కి పైగా అనుబంధ సంస్థలు ఉన్నాయి. ఎస్‌ఏఐకి అవసరమైన క్రీడా మౌలిక సదుపాయాలు, నివాస వసతులు కల్పించేందుకు యూనివర్సిటీ అంగీకరించింది.

ఈ మేరకు 2024 డిసెంబర్ 9న SAAP–ఎస్‌వీ యూనివర్సిటీ(SAAP–SV University) రిజిస్ట్రార్ మధ్య అవగాహన ఒప్పందం (MoU) కుదిరింది. ఇక, భారత క్రీడా ప్రాధికార సంస్థతో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారిక ఒప్పందం కుదుర్చుకోవడానికి సిద్ధంగా ఉందని SAAP వెల్లడించింది. కర్నూలులోని ప్రస్తుత ఎస్‌టీసీ భవనం నివాసానికి అనర్హంగా మారిన నేపథ్యంలో, క్రీడాకారుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఆధునిక సదుపాయాలు కలిగిన తిరుపతి ఎస్‌వీ యూనివర్సిటీకి ఎస్‌టీసీని తరలించాలని ప్రతిపాదించారు.

ఈ మేరకు కర్నూలు SAI ట్రైనింగ్ సెంటర్‌ను తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయానికి తరలించేందుకు 62వ గవర్నింగ్ బాడీ సమావేశంలో అనుమతి ఇవ్వాలని అధికారికంగా ప్రతిపాదన పెట్టారు.