Mynampally | కార్యకర్తలను కంటికి రెప్పలా చూసుకుంటాం

Mynampally | కార్యకర్తలను కంటికి రెప్పలా చూసుకుంటాం
- బైక్ ర్యాలీలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు….
- హనుమంతరావు సమక్షంలో పలువురు సర్పంచ్ లు కాంగ్రెస్ లో చేరికలు
Mynampally | నిజాంపేట, ఆంధ్రప్రభ : సర్పంచ్ ఎన్నికలలో గెలుపొందిన గ్రామాల సర్పంచ్ లు ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తారని మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలో ఇవాళ ఎన్నికలలో గెలుపొందిన సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన చల్మెడ కమాన్ నుండి నిజాంపేట వరకు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ చేపట్టారు.
స్థానిక శ్రీ రేణుక మాత ఫంక్షన్ హాల్ లో ఆత్మీయ సమ్మేళనం ముఖ్య కార్యకర్తల సమావేశంలో కార్యక్రమంలో పాల్గొని గెలుపొందిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మండలంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించడంపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కృషి ఎంతో ఉందని పార్టీకి కష్టపడుతున్న ప్రతి ఒక్క కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. ముఖ్యంగా పార్టీలో కులాలకు అతీతంగా పనిచేయాలని కులం పేరుతో రాజకీయం చేయవద్దని నాయకులకు సూచించారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉండి.. ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పని చేస్తుందన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో కుటుంబ పాలనకే ప్రాముఖ్యత ఇచ్చిందే.. కానీ ప్రజలకు చేసింది ఏమీ లేదని, దోచుకోవడం దాచుకోవడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ పార్టీపై పిచ్చి కూతలు బంద్ చేయాలని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని సిద్దిపేటలో హరీష్ రావు ఆటలు ఇక సాగనివ్వమని నీ దుకాణాన్ని బంద్ చేసి హరీష్ రావును ఓడించే పనిలో ఉంటానని మైనంపల్లి కార్యకర్తల మధ్య శపథం చేశారు.
అలాగే నిజాంపేట మండలానికి కావలసిన ఎంపీడీవో, ఎమ్మార్వో, పోలీస్ స్టేషన్, జూనియర్ కళాశాల పక్క భవనాలు మంజూరు అయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే జనవరి 25 శ్రీ తిరుమల నాథ స్వామి బ్రహ్మోత్సవాలు ఉన్నందున చల్మెడకమాన్ నుండి గ్రామం వరకు డాంబర్ రోడ్డు పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటామని ప్రజలకు హామీ ఇచ్చారు. రానున్న స్థానిక జెడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అనంతరం నంద గోకుల్ గ్రామ సర్పంచ్ భాను ప్రకాష్ రెడ్డి, తిప్పనగుల్ల గ్రామ సర్పంచ్ మంజులతో పాటు వివిధ పార్టీలకు చెందిన సుమారు 80మంది ని కాంగ్రెస్ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.
కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలను కడుపులో పెట్టి చూసుకుంటామని ఆయన భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, మండల అధ్యక్షుడు వెల్దుర్తి వెంకటేష్ గౌడ్, మాజీ సర్పంచ్ అమర సేనా రెడ్డి, పట్టణ అధ్యక్షులు కోమ్మట బాబు, మాజీ ఎంపీపీ దేశెట్టి సిద్ధిరాములు, పంజా మహేందర్, నసీరుద్దీన్, రాజకిషన్, కొమ్మట సత్యనారాయణ, చింతల స్వామి, రవీందర్ రెడ్డి, బాల్రెడ్డి, సుప్రభాత రావు, రమేష్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, లింగం గౌడ్, మారుతి, మహేందర్ రెడ్డి,శ్రీనివాస్ నాయక్, అక్కపల్లి రామ్ రెడ్డి, సర్పంచులు రామచందర్ నాయక్, సునీత బాబు నాయక్, బొమ్మనమల్లేశం, ముత్యాల సరిత మధుసూదన్ రెడ్డి, నాతిఅంజమ్మ లక్ష్మా గౌడ్, ఉప సర్పంచ్ ఆకుల మహేందర్, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
