నిర్ణీత వ్యవధిలోగా సమస్యలు పరిష్కరించాలి..

  • మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు

జి.కొండూరు, ఆంధ్రప్రభ : ప్రజల సమస్యలను నిర్ణీత వ్యవధిలోగా పరిష్కరించాలని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు అధికారులను ఆదేశించారు. ప్రజాదర్బార్‌లో స్వీకరించిన అర్జీల పరిష్కారంలో అలసత్వం ప్రదర్శిస్తే సహించేది లేదన్నారు. జి.కొండూరులోని కమ్యూనిటీ హాల్‌లో శనివారం నిర్వహించిన ‘ప్రజాదర్బార్’ కార్యక్రమంలో ఎమ్మెల్యే కృష్ణప్రసాదు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, ప్రతి సమస్యను ఓపిగ్గా విన్నారు. అనంతరం సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉండే పారదర్శక పాలన అందిస్తోందని, దానికి ప్రజాదర్బార్ కార్యక్రమమే నిదర్శనమని అన్నారు. ఇళ్లు, ఇళ్ల స్థలాలు, ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ, రైస్ కార్డులు, ఉపాధి, పెన్షన్లు, దివ్యాంగుల ధ్రువపత్రాలు, తాగునీటి పైప్‌లైన్లు, భూ సమస్యలు, రహదారుల అభివృద్ధి, రెవెన్యూ మరియు పోలీసు సేవలకు సంబంధించిన అనేక అర్జీలు అందినట్లు తెలిపారు. ప్రజాదర్బార్ వేదికపై అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉంటారని, ప్రజల నుంచి వచ్చిన ప్రతి అర్జీని పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టమ్ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసి జవాబుదారీతనంతో పరిష్కరిస్తున్నట్లు వెల్లడించారు.

ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని, అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించి ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడం ద్వారా ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ ఆశీస్సులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , మంత్రి నారా లోకేష్ నిరంతరం కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.