భూగర్భ జలాల సంరక్షణకు ప్రతి ఇంటా ఇంకుడు గుంతలు నిర్మించాలి
మోత్కూర్, ఆంధ్రప్రభ: భూగర్భ జలాలను పెంపొందించి భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని మోత్కూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ పల్లెర్ల వెంకన్న గుప్త అన్నారు.
శనివారం మున్సిపల్ కేంద్రంలోని 1వ వార్డులో ‘క్యాచ్ ది రెయిన్’ నినాదంతో ఇంకుడు గుంతల అవసరం, భూగర్భ జలాల సంరక్షణ, నీటి పునర్వినియోగంపై ఇంటింటి అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా వెంకన్న గుప్త మాట్లాడుతూ, ప్రతి ఇంటిలో ఇంకుడు గుంత నిర్మించుకోవడం ద్వారా వర్షపు నీరు భూమిలోకి ఇంకి భూగర్భ జలాలు పెరుగుతాయని, తద్వారా భావితరాలకు నీటి వనరులను సంరక్షించవచ్చని తెలిపారు. నీటి వృథాను నివారించడం ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు.
ప్రతి ఒక్కరూ నీటి సంరక్షణపై అవగాహన పెంపొందించుకొని, కుటుంబ సభ్యులను కూడా ఇంకుడు గుంతల నిర్మాణానికి ప్రోత్సహించాలని సూచించారు. కొత్తగా గృహ నిర్మాణం చేపట్టే సమయంలో తప్పనిసరిగా ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకోవాలని, భూగర్భ జలాల పెంపులో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గోల్కొండ నర్సయ్య, వార్డు అధికారి సాయి సుప్రియ, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ శ్రవణ్, మున్సిపల్ సిబ్బంది నర్సింహాచారి, బయ్యని మోహన్రావు, వార్డు ప్రజలు జంపాల యోగానందం, బీసు రాహుల్ తదితరులు పాల్గొన్నారు.
