ప్రతిభకు వేదికగా సమ్మర్ క్యాంపులు..
ప్రతిభకు వేదికగా సమ్మర్ క్యాంపులు..
నైపుణ్యం, ఫిట్నెస్, క్రమశిక్షణకు దోహదం.
శాప్ చైర్మన్ రవి నాయుడు
ఘనంగా సమ్మర్ కోచింగ్ క్యాంప్స్ ప్రారంభం..
ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో శాప్ ఆధ్వర్యంలో..
ముఖ్య అతిథిగా రవి నాయుడు హాజరు..
55 క్రీడల్లో శిక్షణ
రాష్ట్రవ్యాప్తంగా 1389 క్యాంపులు,1020 వేదికలు
ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : క్రీడాకారులు దాగి ఉన్న నైపుణ్య వెలుగు తీసేందుకు సమ్మర్ క్యాంపులు వేదిక కానున్నాయని శాప్ చైర్మన్ రవి నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో విజయవాడలో సమ్మర్ కోచింగ్ క్యాంప్స్ ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందిరా గాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియం వేదికగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి శాప్ చైర్మన్ రవి నాయుడు ముఖ్య అతిథిగా హాజరై క్యాంపులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ సమ్మర్ కోచింగ్ క్యాంపుల్లో బ్యాడ్మింటన్, టెన్నిస్, కబడ్డీ, వాలీబాల్, ఫుట్‌బాల్, అథ్లెటిక్స్, వాటర్ గేమ్స్ తదితర 55 క్రీడా విభాగాల్లో శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధితో పాటు ఫిట్‌నెస్, క్రమశిక్షణ, జట్టు భావన పెంపొందించడమే లక్ష్యమని పేర్కొన్నారు. రాష్ట్రంలోని జిల్లా కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాలు, 423 మండలాల్లో మొత్తం 1020 వేదికలపై 1389 కోచింగ్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు వివరించారు.

వేసవి సెలవులను సద్వినియోగం చేసుకుని క్రీడల్లో ప్రతిభను చాటుకునే వేదికగా ఈ క్యాంపులు ఉపయోగపడతాయని తెలిపారు. చిన్న వయస్సు నుంచే క్రీడలపై ఆసక్తి పెంపొందితే భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు తయారవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఫిట్ ఇండియా లక్ష్య సాధనలో భాగస్వాములు కావాలని పిలుపునిస్తూ, దాదాపు పదేళ్ల తర్వాత జిల్లా క్రీడా ప్రాధికార సంస్థలకు క్రీడా సామాగ్రి అందజేయడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా క్రీడాకారులకు క్రీడా సామాగ్రి, పౌష్టిక ఆహారం పంపిణీ చేశారు. దాతలుగా ముందుకు వచ్చిన విజయవాడ రాయల్ క్లబ్ అమరావతి ప్రెసిడెంట్ కల్లమ్ అనిల్ బాబు, కైండ్ హార్ట్స్ సభ్యుడు కాజా మోహస్‌లను శాలువాలతో సత్కరించారు. క్రీడల అభివృద్ధికి సహకరిస్తున్న దాతలు, క్రీడా సంఘాలు, కోచ్‌లు, స్వచ్ఛంద సేవకులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. శాప్ ఎండీ భరణి మాట్లాడుతూ కోచ్‌లు స్పాన్సర్లతో భాగస్వామ్యాలు పెంచుకుని క్యాంపులను విజయవంతం చేయాలని, ప్రతిభావంతుల గుర్తింపుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శాప్ బోర్డు సభ్యులు సంతోష్, రమణరావు, ఏవో రామావత్ వెంకటరమణ నాయక్, అంతర్జాతీయ క్రీడాకారులు సూర్య చరిష్మా (బ్యాడ్మింటన్), అనూష (రోలర్ స్కేటింగ్) తదితరులు పాల్గొన్నారు.



