వర్షాల వేళ అప్రమత్తంగా ఉండాలి
వర్షాల వేళ అప్రమత్తంగా ఉండాలి
మునుగోడు, (ఆంధ్రప్రభ): భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వేర్వేరు ప్రకటనల్లో కోరారు.
రైతులు వ్యవసాయ పనుల నిమిత్తం పొలాలకు వెళ్లే సమయంలో విద్యుత్ మోటార్లు, విద్యుత్ వైర్లు, ఇతర విద్యుత్ పరికరాల వద్ద ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్ స్తంభాలను చిన్నారులు తాకకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. వర్షాల సమయంలో విద్యుత్ ప్రమాదాల ముప్పు ఎక్కువగా ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని పేర్కొన్నారు.
వాగులు, వంకలు ప్రవహిస్తున్న సమయంలో వాటిని దాటేందుకు ప్రయత్నించవద్దని, ప్రాణాలకు ప్రమాదం కలిగించే సాహసాలకు దూరంగా ఉండాలని సూచించారు. ప్రజల భద్రతే ముఖ్యమని, వర్షాకాలంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ అవసరమైన జాగ్రత్తలు పాటించాలని కోరారు.
అధికారులు ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి అవసరమైన సహాయ చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సూచించారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి తమ భద్రతను కాపాడుకోవాలని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
