అమ్మవారి సన్నిధిలో పాటల సీడీ ఆవిష్కరణ
శ్రీ జ్ఞాన సరస్వతి దేవిపై రచించిన పాటలను విడుదల చేసిన ఆలయ అధికారులు
బాసర, ఆంధ్రప్రభ: బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారిపై రచించిన భక్తి గీతాల సీడీని బుధవారం ఆలయ సన్నిధిలో ఘనంగా ఆవిష్కరించారు. ఆలయ ఇన్‌చార్జి ఈవో విజయ రామారావు, ఆలయ స్థానాచార్యులు ప్రవీణ్ పాఠక్, ఆలయ అర్చకులు సంయుక్తంగా సీడీని విడుదల చేశారు.
హైదరాబాద్‌కు చెందిన మామిడాల సాహితి ప్రస్తుతం జనగాంలో మెడిసిన్ మొదటి సంవత్సరం చదువుతోంది. చదువుల తల్లి శ్రీ జ్ఞాన సరస్వతి దేవిపై ఉన్న భక్తితో ఆరు భక్తి గీతాలను రచించి, వాటిని సీడీ రూపంలో అమ్మవారి సన్నిధిలో విడుదల చేయడం ఎంతో ఆనందంగా ఉందని ఆమె తెలిపారు.
ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు మామిడాల సాహితికి అమ్మవారి ప్రసాదం అందజేసి శాలువాతో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు మురళి, శృతి, హరీష్ తదితరులు పాల్గొన్నారు.
