ఎంఎస్ఎంఈలతో కొత్త ఆర్థిక దిశ

ఎంఎస్ఎంఈలతో కొత్త ఆర్థిక దిశ
ఏపీ అభివృద్ధి రోడ్‌మ్యాప్ ప్రకటించిన సీఎం
విజయవాడ, ఆంధ్రప్రభ (ఎన్టీఆర్ బ్యూరో):
విజయవాడలో నిర్వహించిన ఎంఎస్ఎంఈ గ్రోత్ సమిట్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. ఎంఎస్ఎంఈలే దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయం తర్వాత అత్యధిక ఉపాధి కల్పిస్తున్న రంగం ఎంఎస్ఎంఈలేనని, యువత కలలను నిజం చేసుకునే వేదికగా ఈ రంగం నిలుస్తోందని అన్నారు.
రాష్ట్రంలో కోటి ఎంఎస్ఎంఈలు ఏర్పాటే ప్రభుత్వ లక్ష్యమని సీఎం తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రత్యేక రాయితీలు అందిస్తున్నామని చెప్పారు. ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున 175 ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్రంలో 550 ఇండస్ట్రియల్ పార్కులు ఉన్నాయని, వాటిలో శ్రీ సిటీ దేశంలోనే నంబర్ వన్‌గా ఎదిగిందని పేర్కొన్నారు.
ఈ ఏడాది ఐదు లక్షల మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని సీఎం తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ను ఇన్నోవేషన్ ఆధారిత ఎకోసిస్టమ్‌గా మార్చి, 100 యూనికార్న్ సంస్థలు రాష్ట్రం నుంచి రావాలని ఆకాంక్షించారు. కియా కార్పొరేషన్, గూగుల్, ఆర్సెలర్ మిట్టల్ వంటి అంతర్జాతీయ సంస్థలు ఏపీకి రావడం అభివృద్ధికి సంకేతమన్నారు.
విశాఖపట్నంను డేటా సెంటర్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నామని, తొలి క్వాంటమ్ కంప్యూటర్ ఈ ఏడాది డిసెంబరులో అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు. రాయలసీమలో డ్రోన్, స్పేస్, ఆటోమొబైల్, స్టీల్, సిమెంట్ పరిశ్రమలకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.
ఎంఎస్ఎంఈలకు భూ కేటాయింపు అధికారాన్ని కలెక్టర్లకు అప్పగించినట్లు చెప్పారు. టెంపుల్, ఎకో, బీచ్ టూరిజం అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ అనుకూలమని, సూర్యలంక బీచ్, పాపికొండలు, గండికోట వంటి ప్రాంతాలు రాష్ట్ర ప్రత్యేకత అని పేర్కొన్నారు.
పరిశ్రమల ఏర్పాటులో రైతుల సహకారం కీలకమని సీఎం తెలిపారు. నైతిక విలువలతో పని చేస్తేనే సమాజం అభివృద్ధి చెందుతుందని చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో 23 లక్షల ఉద్యోగాలు కల్పించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఆయన వెల్లడించారు.

