రోడ్డుపైనే మురుగు మడుగులు….
డ్రైన్ల ఆక్రమణలతో మైలవరంలో ప్రజలకు నరకయాతన
ఆక్రమణలు తొలగించి పక్కా డ్రైన్లు నిర్మించాలని స్థానికుల విజ్ఞప్తి
మైలవరం, ఆంధ్రప్రభ : మైలవరం పట్టణంలోని ప్రధాన రహదారుల దుస్థితి రోజురోజుకూ మరింత అధ్వానంగా మారుతోంది. ఇప్పటికే దెబ్బతిన్న రోడ్లకు తోడు డ్రైన్ల ఆక్రమణల కారణంగా మురుగు నీరు, వర్షపు నీరు రహదారులపైనే నిల్వ ఉండడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ప్రధాన రహదారి నుంచి కోర్టు వైపు వెళ్లే రహదారికి ఇరువైపులా భవనాలు నిర్మించే సమయంలో డ్రైన్లను ఆక్రమించుకోవడంతో మురుగు నీరు సక్రమంగా ప్రవహించడం లేదు.
దీంతో మురుగు నీరు రోడ్డుపైకి చేరుతుండగా, కొద్దిపాటి వర్షం కురిసినా నీరు రోజుల తరబడి నిలిచిపోయి రహదారి మొత్తం మడుగులా మారుతోంది. ఫలితంగా రోడ్డు పూర్తిగా దెబ్బతిని ప్రయాణికులకు ప్రమాదకరంగా మారింది. ఈ రహదారిలోనే కోర్టుతో పాటు మండల పరిషత్ కార్యాలయం, వెలుగు కార్యాలయం, ఉపాధి హామీ పథకం కార్యాలయం, రక్షిత మంచినీటి శాఖ, గృహ నిర్మాణ శాఖ, మండల విద్యాశాఖ, పంచాయతీరాజ్ శాఖ కార్యాలయాలు, భవిత విద్యా వనరుల కేంద్రం, ఎంపీపీ పాఠశాల, అంగన్వాడీ కేంద్రం వంటి కీలక ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు ఉన్నాయి.
ప్రతిరోజూ అధికారులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, న్యాయవాదులు, కోర్టుకు వచ్చే కక్షిదారులు ఈ మార్గంలోనే రాకపోకలు సాగిస్తున్నారు. రోడ్డుపై నిలిచిపోయిన మురుగు, వర్షపు నీటితో దుర్వాసన వెదజల్లడమే కాకుండా దోమలు పెరిగే పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాహనదారులు తరచూ ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రహదారి పక్కన ఉన్న డ్రైన్ల ఆక్రమణలను తొలగించి, పక్కా డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసి, దెబ్బతిన్న రహదారిని మరమ్మతులు చేయాలని స్థానిక ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు.
