ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్ లో పెట్టవద్దు

ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్ లో పెట్టవద్దు

  • ఆర్డీఓ గణేష్
  • 13 దరఖాస్తుల స్వీకరణ

తొర్రూరు, ఆంధ్రప్రభ : ప్రజావాణి అర్జీలను పెండింగ్ లో పెట్టవద్దని తొర్రూరు ఆర్డీవో గణేష్ తెలిపారు.డివిజన్ కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు.రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో స్థానికులు నుంచి 13 దరఖాస్తులు అందాయి. దానిలో 10 రెవెన్యూ, 5 పంచాయతీ రాజ్ 1, ఇరిగేషన్ శాఖ 1, సర్వే శాఖ నుంచి 1 దరఖాస్తులు అందాయి.
వచ్చిన దరఖాస్తుల్లో భూ సంబంధిత, వ్యక్తిగత సమస్యలే ఎక్కువగా ఉన్నాయి.

తొర్రూరు, పెద్దవంగర, నెల్లికుదురు, దంతాలపల్లి, మరిపెడ, చిన్న గూడూరు, నరసింహుల పేట మండలాలకు సంబంధించిన వారు దరఖాస్తులు అందించారు. అర్జీదారుల దరఖాస్తులలో పేర్కొన్న సమస్యల పై క్షుణ్ణంగా పరిశీలించి వెంటనే పరిష్కరించుటకు తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులకు ఆర్డిఓ ఆదేశించారు.

ఆర్డీవో మాట్లాడుతూ.. ఫిర్యాదుల పరిష్కారంలో అధికారులు అలసత్వం వహిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. పరిష్కరించలేని సమస్యలు ఉంటే దరఖాస్తుదారులకు సమాచారం అందించాలన్నారు. వచ్చిన దరఖాస్తులకు నెల రోజుల్లో పరిష్కారం చూపాలన్నారు. ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని,అనుమతి లేకుండా గైర్హాజరైన అధికారులకు నోటీసులు జారీ చేస్తామని స్పష్టం చేశారు.

నకిలీ భూపత్రాలు సృష్టించిన వ్యక్తి పై చర్య తీసుకోవాలి
బాధితుడు బానోతు ధర్మానాయక్

మండలంలోని కంటాయపాలెం శివారు సీత్యా తండాకు చెందిన బానోతు ధర్మానాయక్ కు తండాలో 2 ఎకరాల భూమి వారసత్వంగా సంక్రమించింది.తన కుమారుడు, కోడలు కు ఇటీవల తగాదాలు కాగా దాన్ని ఆసరా చేసుకున్న తండాకు చెందిన భానోత్ వెంకన్న నకిలీ భూ కాగితాలు సృష్టించి రెవిన్యూ అధికారులకు తప్పుడు సమాచారం అందించి వారిపై పట్టా చేయించుకునేందుకు యత్నిస్తున్నారు. న్యాయబద్ధంగా ధర్మా నాయక్ సంక్రమించిన భూమిని ఇతరుల పేరిట పట్టా చేయవద్దని ఆర్డీవోను వేడుకున్నారు.
ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కాకుండా చూడాలి
పెద్దవంగర దళితులు

పెద్ద వంగర మండల కేంద్రంలోని సర్వే నెంబర్ 50/1 లో 6.14 ఎకరాల్లో నివాస గృహాల కోసం, సర్వే నెంబర్ 50/2 లో 2.30 ఎకరాల్లో 50 డబుల్ బెడ్ రూం ఇండ్ల కోసం ప్రభుత్వం భూమిని కేటాయించింది. ఈ ఇండ్లళ్లో గత మూడేళ్లుగా 10 మంది దళితులు తాత్కాలికంగా నివాసం ఉంటున్నారు. సర్వే నెంబర్ 50/2 కు సరిహద్దు పట్టాదారు సంకెపల్లి రవీందర్ రెడ్డి డబుల్ బెడ్ రూం కోసం కేటాయించిన స్థలంలో కొంత భాగాన్ని ఆక్రమించుకుని ప్రహారీ గోడను సైతం నిర్మించాడు. అదే మాదిరిగానే మరో వైపు కూడా ప్రహరీ గోడ నిర్మించేందుకు డబుల్ బెడ్ రూమ్ వెనకాల ఉన్న మొక్కలు, వాటర్ పైపులను ధ్వంసం చేశాడు.

సర్వేయర్, ఆర్ఐ తో వేయించిన సరిహద్దులను కూడా ధ్వంసం చేసి, ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు. చిలుక సోమయ్య, సుంకరి ఓంకార్, చెరుకు సాలయ్య, సుంకరి ఏసయ్య, జలగం నాగరాజు, చెరుకు వెంకన్న, సుంకరి యాకమ్మ, పెరాల శ్రీలత, రాంపాక ముత్తయ్య, జలగం శ్రీను లకు ఇంజెక్షన్ ఆర్డర్ కోసం కోర్టు నుండి నోటీసులు పంపించారు.దాంతో పాటుగా సర్వే నెంబర్ 50/3 లోని 0.27 గుంటల్లో కెనాల్ కాలువ ఉంది, ఆ కాలువను కూడా కబ్జా చేసి, కాలువ నడి మధ్యలో ప్రహారీ గోడను నిర్మించాడు.

దీనిపై అధికారులు వెంటనే స్పందించి, ప్రభుత్వ భూమికి సరిహద్దులు ఏర్పాటు చేయాలని కోరుతూ పెద్ద వంగర దళితులు ప్రజావాణిలో ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. ప్రజావాణిలో డి ఎల్ పి ఓ పుల్లారావు, డిప్యూటీ డిఎంహెచ్వో సుధీర్ రెడ్డి, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ రవి, విద్యుత్ శాఖ డిఈ రవి,హౌసింగ్ ఏఈ యాకన్న, సిడిపిఓ కమలాదేవి, మిషన్ భగీరథ డిప్యూటీ ఈఈ మోహన్, ఎక్సైజ్ ఎస్సై శంకర్, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.