ఘనంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం
మోత్కూర్, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ 4వ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా గురువారం శ్రీ పద్మావతి గోదాదేవి సతీసమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేద పండితులు మంత్రోచ్ఛారణల నడుమ కల్యాణ వేడుకలు భక్తిశ్రద్ధలతో సాగాయి.
ఈ సందర్భంగా శాంతి పాఠం, ద్వారపూజ, మూర్తి కుంభ ఆరాధన హోమం, నిత్య పూర్ణాహుతి కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమాన్ని భక్తులు, ఆలయ కమిటీ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని తిలకించారు. అనంతరం భక్తులకు మహా అన్న ప్రసాదం పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు సోలిపురం చంద్రారెడ్డి, అధ్యక్షుడు ముప్పా వెంకట్ రెడ్డి, ఉపాధ్యక్షులు ఏలే ఉప్పలయ్య, దామెర స్వాతి, ప్రధాన కార్యదర్శి గుండా మల్లేశం, కోశాధికారి ఆమనగంటి వెంకటరెడ్డి, సహాయ కార్యదర్శి ముప్ప తిరుమల్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.
