రాష్ట్ర ఛాంపియన్‌షిప్‌తో దీపిక, కరమత్ జోడీ సత్తా
రాష్ట్ర మిక్స్‌డ్ డబుల్స్ ఛాంపియన్లుగా గుంటూరు క్రీడాకారులు
గుంటూరు స్పోర్ట్స్, ఆంధ్రప్రభ : బ్యాట్ పడితే పతకం సాధించాల్సిందే అన్న పట్టుదలతో గుంటూరు బ్యాడ్మింటన్ క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో వరుస విజయాలు సాధిస్తూ సత్తా చాటుతున్నారు. ఇటీవల శ్రీకాకుళంలో జరిగిన రాష్ట్రస్థాయి మహిళల డబుల్స్ విభాగంలో ఛాంపియన్లుగా నిలిచిన అక్కాచెల్లెళ్లు స్రవంతి, దీపికల్లో తాజాగా దీపిక మరో ఘనత సాధించింది.
ఒంగోలులో జరిగిన రాష్ట్రస్థాయి మిక్స్‌డ్ డబుల్స్ పోటీల్లో దీపిక, కరమత్ ఉల్ హక్ జోడీ విజేతగా నిలిచి ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకుంది. దీంతో ఈ ఏడాది రాష్ట్రస్థాయిలో రెండు విభిన్న విభాగాల్లో గుంటూరు క్రీడాకారులు ఛాంపియన్లుగా నిలిచి తమ ప్రతిభను చాటుకున్నారు. గత కొంతకాలంగా రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీల్లో నిలకడగా రాణిస్తున్న వీరు కోచ్ కిరణ్‌కుమార్ వద్ద శిక్షణ పొందుతూ రాష్ట్రంతో పాటు గుంటూరు జిల్లాకు మంచి పేరు తీసుకొస్తున్నారు.
ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న క్రీడాకారులకు అండగా నిలిచి, వారికి అవసరమైన శిక్షణ అందిస్తూ ఈ స్థాయికి తీసుకురావడంలో కోచ్ కిరణ్‌కుమార్ చేస్తున్న కృషిని పలువురు అభినందిస్తున్నారు. క్రీడాకారులకు మరింత మెరుగైన శిక్షణ, అవసరమైన ప్రోత్సాహం అందిస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోనూ రాణించే అవకాశాలు ఉన్నాయని సీనియర్ క్రీడాకారులు పేర్కొన్నారు.
రాష్ట్ర మిక్స్‌డ్ డబుల్స్ ఛాంపియన్లుగా నిలిచిన దీపిక, కరమత్ ఉల్ హక్ జోడీని జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు రాయపాటి రంగారావు, కార్యదర్శి సంపత్‌కుమార్, రమేష్, రాము, సతీష్‌చంద్ర, సీనియర్ క్రీడాకారులు వివేక్, ఖాదర్, హేమంత్, జితేంద్ర తదితరులు అభినందించారు.
