ఉపాధి హామీ పనిదినాలు 125కి పెంపు స్వాగతించదగ్గ నిర్ణయం
వీబీ గ్రామ్‌జీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
రైతులు, కూలీలకు మరింత భరోసా కలుగుతుంది : ఎమ్మెల్యే
ఉంగుటూరు, ఆంధ్రప్రభ : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి బదులుగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వికసిత్ భారత్ గ్రామీణ్ రోజ్‌గార్ అజీవిక మిషన్ గ్రామీణ్ (వీబీ గ్రామ్‌జీ) కార్యక్రమాన్ని గన్నవరం నియోజకవర్గం ఉంగుటూరు మండలం తేలప్రోలులో ఏపీ ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గురువారం ప్రారంభించారు.
రైతులు, ఉపాధి హామీ కూలీలతో కలిసి పంట కాలువలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, కార్యక్రమ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం గ్రామంలో ఉపాధి హామీ పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడమే వీబీ గ్రామ్‌జీ లక్ష్యమని తెలిపారు. ఉపాధి హామీ పనిదినాలను 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచడం రైతులు, కూలీలకు ఎంతో ప్రయోజనకరమని పేర్కొన్నారు. అలాగే రోజువారీ కూలీని రూ.307 నుంచి రూ.312కు పెంచడం కూడా స్వాగతించదగ్గ నిర్ణయమన్నారు.
గతంలో రైతులే తపిరీలు వేసుకుని పంట బోదులు, కాలువలు, గట్లు సంరక్షించుకునే పరిస్థితి ఉండేదని, కౌలు వ్యవస్థ పెరగడంతో ఆ పద్ధతి తగ్గిపోయిందని ఆయన అన్నారు. దీంతో పంట బోదులు, కాలువలు పూడిపోవడం, గట్లు దెబ్బతినడం జరిగిందని పేర్కొన్నారు. పొలం ఎవరిదైతే వారే బాధ్యతగా సంరక్షించుకోవాల్సిన అవసరం ఉందని, పాత వ్యవసాయ విధానాలు తిరిగి రావాలని వ్యక్తిగతంగా కోరుకుంటున్నానని తెలిపారు.
తిరుపతిలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఈ పథకం ప్రారంభం కావడం ఆంధ్రప్రదేశ్‌కు గర్వకారణమని పేర్కొన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు ఎస్సీ కాలనీ రహదారి సమస్యను ప్రస్తావించగా, రూ.10 లక్షలతో నెల రోజుల్లో రహదారి నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. అలాగే గ్రామంలోని కచ్చా డ్రెయినేజీ సమస్యను వారం రోజుల్లో పరిష్కరించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
ప్రజలకు ఇబ్బందులు కలిగించే అధికారులను ఉపేక్షించబోమని హెచ్చరించారు. గత ప్రభుత్వ హయాంలో మట్టి అక్రమ తవ్వకాలు, అవినీతి జరిగాయని ఆరోపించారు. ప్రస్తుతం గన్నవరంలో మట్టి అక్రమ రవాణాను పూర్తిగా అడ్డుకున్నామని చెప్పారు.
అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఇళ్ల స్థలాల మెరక పనులు చేపట్టి లబ్ధిదారులకు ఉచితంగా మట్టి అందించామని తెలిపారు. త్వరలో గన్నవరంలో ఏఐ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే సీఎస్‌ఆర్ నిధులతో రూ.4.50 కోట్లతో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అభివృద్ధి పనులు చేపట్టినట్లు చెప్పారు.
ఇంటింటికీ రక్తపరీక్షల కార్యక్రమాన్ని గన్నవరం నియోజకవర్గంలో అమలు చేస్తూ ఇప్పటివరకు 60 వేల మందికి పైగా పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. గన్నవరం పట్టణం నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమాన్ని మొత్తం నియోజకవర్గానికి విస్తరించామని వివరించారు.
రైతులకు అవసరమైన ఎరువుల సరఫరాపై త్వరలో ప్రత్యేక సమీక్ష నిర్వహిస్తామని, చిన్న, సన్నకారు రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఈ. సత్యకుమార్, టీడీపీ మండల అధ్యక్షులు కొలుసు రవీంద్ర, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
