యువ క్రికెటర్ విశ్వనాథ్ వైష్ణవ్ కుటుంబాన్ని పరామర్శించిన గంట రవికుమార్
కరీమాబాద్, ఆంధ్రప్రభ : వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని ఎస్ఆర్‌ఆర్ తోటకు చెందిన ప్రముఖ యువ క్రికెట్ క్రీడాకారుడు విశ్వనాథ్ వైష్ణవ్ ఇటీవల అకాల మరణం చెందడం పట్ల బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వైష్ణవ్ మరణవార్త తెలుసుకున్న గంట రవికుమార్ సోమవారం బీజేపీ నాయకులతో కలిసి ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
వారిని ఓదార్చి ధైర్యం చెప్పారు. ఎంతో ప్రతిభ కలిగిన యువ క్రికెటర్ చిన్న వయసులోనే మృతి చెందడం క్రీడారంగానికి, ఆయన కుటుంబానికి తీరని లోటని గంట రవికుమార్ అన్నారు. వైష్ణవ్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తూ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ఎర్రగొల్ల భరత్‌వీర్, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎలగందుల శ్రవణ్, కరీమాబాద్ మండల ప్రధాన కార్యదర్శి వంచనగిరి రాజ్‌కుమార్, ఆడెపు రవిరాం పాల్గొన్నారు.
