సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం

వరంగల్ జిల్లా కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత

హనుమకొండ, ఆంధ్రప్రభ : కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్‌ మహిళా శ్రేణులు సోమవారం ఆందోళన చేపట్టారు. బాలసముద్రంలోని బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం నుంచి వరంగల్ జిల్లా కలెక్టరేట్ వరకు ర్యాలీగా చేరుకున్న మహిళలు కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎగ్గొట్టిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ నాయకులు సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. దీంతో కలెక్టరేట్ పరిసరాల్లో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆందోళనలో మాజీ ప్రభుత్వ విప్ వినయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పాల్గొన్నారు. అనంతరం వినయ్ భాస్కర్‌ను పోలీసులు అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తుండగా బీఆర్‌ఎస్‌ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టి వినయ్ భాస్కర్‌ను అరెస్టు చేసి సుబేదారి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.