రోడ్డు విస్తరణ ఎప్పుడో…?

రోడ్డు విస్తరణ ఎప్పుడో…?

  • మోత్కూర్- నార్కెట్ పల్లి రూట్లో చేపట్టని రోడ్డు విస్తరణ
  • గుంతలమయంగా రోడ్డు.. తరచుగా ప్రమాదాలు
  • అంబేద్కర్ చౌరస్తాలో అస్తవ్యస్తంగా తోపుడు బండ్లు..విస్తరణ చేపట్టినా ముందుకు వచ్చిన వ్యాపారులు

మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ మున్సిపాలిటీ లో మెయిన్ రోడ్డు పై సవతితల్లి ప్రేమ చూపిస్తున్నారని అనక తప్పడంలేదు.ఒక పక్క అంబేద్కర్ చౌరస్తా నుండి కొత్త బస్టాండ్ వరకు రోడ్డు వెడల్పు పనులు చేపట్టి,డ్రైనేజీ, బి టి ,సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టి అద్దంలా తీర్చిదిద్దగా…మరో పక్క అంబేద్కర్ చౌరస్తా నుండి ఇందిరానగర్ వరకు సైతం రోడ్డు వెడల్పు చేపట్టి డ్రైనేజీ, బి టి రోడ్డు నిర్మాణం చేపట్టాల్సినప్పటికి…నిధుల మంజూరు లో అలసత్వమో..? ఈ రోడ్డు పై నిర్లక్ష్యమో ..? కానీ విస్తరణ పనులు చేపట్టకపోవడంతో ఈ మెయిన్ రోడ్డు కాస్త ఇరుకుగా మారి,గుంతలమయంగా మారడంతో..చేసేది ఏమి లేక..మున్సిపల్ అధికారులు బి టి రోడ్డు మోకాళ్ళ లోతు గుంతల్లో మట్టి పోయడంతో …ఈ రోడ్డు కాస్త పూర్తిగా మట్టి రోడ్డుగా మారింది.

రెండు మర్రుల వద్ద ఒక బస్సు వెళ్తే చాలు…మరొక వాహనం కాదు కదా..కనీసం సైకిల్ కూడా పోవడంలేదని ,దీంతో తరచు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని మున్సిపల్ ప్రజలు వాపోతున్నారు.ఈ రూట్లో డ్రైనేజీ లేకపోవడంతో అక్కడి డ్రైనేజీ నీళ్లు వెళ్లే పరిస్థితి లేక.. సమీప వెంచర్ లో చేరుతున్నాయి.ఇదే రూట్లో ఒక వైన్స్,బార్ కూడా ఉండడంతో మద్యం ప్రియులు బండి రోడ్డు పక్కన ఆపితే…బస్సులు,పెద్ద వాహనాలు వెళ్లే పరిస్థితి లేదని పలువురు వాపోతున్నారు.మున్సిపల్ ఎన్నికల కి ముందు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ ఈ రోడ్డు వెడల్పు చేసి మోత్కూర్ ని సుందరనగరంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.ఇప్పటికైనా ఈ రోడ్డు వెడల్పు, డ్రైనేజీ, బి టి రోడ్డు నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయించి ,తక్షణమే రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Leave a Reply