మైలవరంలో ఈదురు గాలుల బీభత్సం

మైలవరంలో ఈదురు గాలుల బీభత్సం

మైలవరం, ఆంధ్రప్రభ : మైలవరం నియోజకవర్గంలో అకస్మాత్తుగా వచ్చిన ఈదురు గాలులు, భారీ వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రకృతి వైపరీత్యంతో మైలవరం పట్టణంతో పాటు పలు గ్రామాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. బలమైన గాలుల ధాటికి పలు ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. రేకుల షెడ్లు కూలిపోయాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు చీకట్లోనే గడపాల్సి వచ్చింది. విషయం తెలుసుకున్న మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు వెంటనే క్షేత్రస్థాయిలో పర్యటించారు. మైలవరం పట్టణంలో ద్విచక్రవాహనాన్ని స్వయంగా నడుపుతూ నష్టపోయిన ప్రాంతాలను మంగళవారం స్వయంగా పరిశీలించి బాధితులను పరామర్శించారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ తో ఫోన్లో మాట్లాడి జరిగిన నష్టాన్ని వివరించారు.

ప్రభుత్వ అధికారులతో మాట్లాడి వెంటనే నష్టాన్ని అంచనా వేయాలని ఆదేశించారు. కూటమి ప్రభుత్వం బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఎమ్మెల్యే కృష్ణప్రసాదు బాధితులకు హామీ ఇచ్చారు. నష్టపోయిన ప్రతి కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని భరోసా ఇచ్చారు. విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టాలని సూచించారు. ప్రజలు అధైర్యపడవద్దని, ప్రభుత్వం మీ వెంటే ఉందని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు ధైర్యం చెప్పారు. కూటమి నాయకులు, కార్యకర్తలు సహాయక చర్యల్లో పాల్గొని బాధితులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ప్రకృతి విపత్తుతో నష్టపోయిన వారికి పరిహారం అందేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే కృష్ణప్రసాదు స్పష్టం చేశారు. ఈ మేరకు రెవిన్యూ అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ పర్యటనలో స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply