భక్తులకు త్రుటిలో తప్పిన ప్రాణాపాయం
తిరుమల, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్: తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు ప్రయాణిస్తున్న రెండు వాహనాలు వేర్వేరు సమయాల్లో ఘాట్‌రోడ్డులో ప్రమాదాలకు గురయ్యాయి. అదృష్టవశాత్తూ రెండు ఘటనల్లోనూ పెద్ద ప్రమాదం తప్పి, ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు.
శ్రీవారి దర్శనం అనంతరం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం చేస్తున్న భక్తులు ప్రయాణిస్తున్న కారు శనివారం సాయంత్రం తొలి ఘాట్‌రోడ్డులో అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో కొందరికి స్వల్ప గాయాలు కావడంతో వారిని వెంటనే తిరుమలలోని అశ్విని ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్స అందించారు.
మరో ఘటన ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. దర్శనం కోసం కొండపైకి వెళ్తున్న భక్తుల వాహనం ఘాట్‌రోడ్డులో అదుపు కోల్పోయి బోల్తా పడింది. వాహనం దెబ్బతిన్నప్పటికీ అందులో ఉన్న ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ రెండు ఘటనలతో ఘాట్‌రోడ్డులో వాహనదారులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వర్షాకాల పరిస్థితుల్లో వేగ నియంత్రణ పాటిస్తూ జాగ్రత్తగా ప్రయాణించాలని విజ్ఞప్తి చేశారు.
