రైతు సేవా కేంద్రాలు సద్వినియోగం చేసుకోవాలి..

ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు

విస్సన్నపేట, ఆంధ్రప్రభ : రైతుల ఆదాయాన్ని పెంచడంతో పాటు వ్యవసాయాన్ని మరింత లాభదాయకంగా తీర్చిదిద్దడంలో జీవనోపాధుల సేవా కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తాయని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అన్నారు. విస్సన్నపేట మండల కేంద్రంలో ఆంధ్రకేసరి రైతు ఉత్పత్తిదారుల సంస్థ (ఎఫ్‌పీఓ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జీవనోపాధుల సేవా కేంద్రాన్ని (ఎల్‌ఎస్‌సీ) మంగళవారం ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లభించేలా మార్కెట్ అవకాశాలు కల్పించడం, వ్యవసాయ ఖర్చులను తగ్గించడం, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు అందుబాటులో ఉంచడం, వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించడం వంటి అంశాల్లో ఈ కేంద్రం కీలకంగా పనిచేస్తుందన్నారు. అలాగే విలువ ఆధారిత ఉత్పత్తులు, నిల్వ, ప్రాసెసింగ్, మార్కెటింగ్ సేవలను ఒకే వేదికపై రైతులకు అందించడం ద్వారా వ్యవసాయం మరింత ప్రయోజనకరంగా మారుతుందని తెలిపారు.

రైతులు ఎఫ్‌పీఓల ద్వారా సంఘటితంగా పనిచేస్తే తమ ఉత్పత్తులకు మెరుగైన ధరలు పొందడంతో పాటు ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, సబ్సిడీలు, బ్యాంకు రుణాలు, సాంకేతిక సలహాలు సులభంగా అందుబాటులోకి వస్తాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రైతుల ఆదాయాన్ని పెంచడం, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను విస్తరించడం, మహిళా సంఘాలు, యువ రైతులకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం వంటి లక్ష్యాలతో జీవనోపాధుల సేవా కేంద్రం పనిచేయాలని ఆకాంక్షించారు.

రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, రైతు అభివృద్ధే రాష్ట్ర అభివృద్ధికి పునాదిగా నిలుస్తుందని పేర్కొంటూ రైతులందరూ ఇలాంటి సేవా కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు, ఎఫ్‌పీఓ ప్రతినిధులు, రైతులు, మహిళా సంఘాల సభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.