సికింద్రాబాద్ నవాబ్స్పై నిజామాబాద్ ఘన విజయం
- హెచ్‌సీఏ బి-డివిజన్ టూ డే లీగ్‌లో మరో విజయంతో జోరు
- అజిత్ అర్ధశతకం.. బౌలింగ్‌లో రయ్యాన్ మెరుపులు
నిజామాబాద్ స్పోర్ట్స్, ఆంధ్రప్రభ : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఆధ్వర్యంలో జరుగుతున్న బి-డివిజన్ టూ డే లీగ్ ఛాంపియన్‌షిప్‌లో నిజామాబాద్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ (ఎన్డీసీఏ) జట్టు మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. సికింద్రాబాద్ నవాబ్స్పై 5 వికెట్ల తేడాతో గెలిచి టోర్నీలో విజయ పరంపరను కొనసాగించింది.
లక్ష్య ఛేదనలో అజిత్ అద్భుతంగా రాణిస్తూ కేవలం 39 బంతుల్లో 56 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. అతని ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. విక్రాంత్ 23 పరుగులు, కెప్టెన్ జి. విక్రమ్ నాయక్ 19 పరుగులు, వర్షిత్ 6 పరుగులతో తమ వంతు సహకారం అందించారు.
బౌలింగ్‌లో రయ్యాన్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. 6 ఓవర్లలో కేవలం 11 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీసి ప్రత్యర్థి బ్యాటింగ్‌ను కట్టడి చేశాడు. నరేన్ 6 ఓవర్లలో 18 పరుగులిచ్చి 2 వికెట్లు, రేవంత్ 4 ఓవర్లలో 20 పరుగులిచ్చి 2 వికెట్లు సాధించారు. వర్షిత్, విక్రమ్ తలో వికెట్ పడగొట్టి జట్టు విజయానికి తోడ్పడ్డారు.
ఈ విజయంతో ఎన్డీసీఏ జట్టు టోర్నీలో తన సత్తాను మరోసారి చాటుకుంది. జట్టు సమిష్టి ప్రదర్శనను అభినందించిన జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రసేన్ రెడ్డి, కార్యదర్శి వెంకట్ రెడ్డి, కోశాధికారి శ్రీనివాసరావు, సంయుక్త కార్యదర్శి సురేష్ బాబు తదితరులు రానున్న మ్యాచ్‌ల్లోనూ ఇదే జోరు కొనసాగించాలని ఆకాంక్షించారు.
