హైడ్రాను ఎత్తేస్తాం.. రేవంత్ పాలనపై కేటీఆర్ తీవ్ర విమర్శలు
హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ ప్రభుత్వం, హైడ్రా వ్యవస్థపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజే హైడ్రాను రద్దు చేస్తామని, దానిని బంగాళాఖాతంలో పడేస్తాం అంటూ వ్యాఖ్యానించారు. హైడ్రాపై హైకోర్టు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, తొమ్మిది తలల విషసర్పంగా అభివర్ణించిందని పేర్కొన్నారు. దీనికంటే ముఖ్యమంత్రికి పెద్ద చెంపపెట్టు మరొకటి ఉండదన్నారు కేటీఆర్.
హైడ్రా చర్యలు పేదలపైనే సాగుతున్నాయని, అధికార పార్టీ నేతలు, మంత్రులు, ముఖ్యమంత్రి కుటుంబానికి చెందిన వారిపై మాత్రం చర్యలు తీసుకోవడం లేదని కేటీఆర్ ఆరోపించారు. చెరువుల పరిధిలో ఉన్న అధికార పార్టీ నాయకుల నిర్మాణాలపై కూడా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. హైడ్రా పేరుతో బిల్డర్ల నుంచి వసూళ్లు జరుగుతున్నాయనే ఆరోపణలను కూడా ప్రస్తావించారు. హైడ్రా నిజంగా నిష్పాక్షికంగా పనిచేస్తే అధికార పార్టీ నేతలకు చెందిన నిర్మాణాలపైనా ఒకే విధమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అలాగే, ఫీజు రీయింబర్స్మెంట్ అంశంపై స్పందిస్తూ.. కరోనా కాలంలో కూడా తమ ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ అందించిందని తెలిపారు. ప్రతిసారీ గత ప్రభుత్వ అప్పులనే కారణంగా చూపడం సరికాదన్నారు. తాము అప్పులతో పాటు ఆదాయ వనరులు కూడా పెంచి రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేసి అప్పగించామని, కానీ పరిపాలనలో వైఫల్యాలను తమపై నెట్టివేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఐటీ ఉద్యోగాల సంఖ్య ఎందుకు తగ్గుతోందో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలోని ప్రతి ప్రాంతంలో నిర్మించిన ఐటీ హబ్‌లను ప్రస్తుతం ప్రభుత్వం సరిగా వినియోగించడం లేదని ఆరోపించారు.
